Vehicle bills into their pockets! వాహన బిల్లులు వారి జేబులోకి..!
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:15 AM
Vehicle bills into their pockets! విజయనగరం డివిజన్‌కు సంబంధించి ఓ ఎంపీడీవో జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే కొత్తకారు కొనుగోలు చేసుకున్నారు. ప్రతిరోజూ జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తూ సాయంత్రం ఇంటికి వెళ్లిపోతారు.
వాహన బిల్లులు
వారి జేబులోకి..!
సొంత ప్రయాణాలకు సర్కారు డబ్బులు
అప్పుడప్పుడే తనఖీలు.. బిల్లులు మాత్రం ఫుల్లు
ఆఫీసులోనే ఉండి డ్రా చేసుకుంటున్న వైనం
జిల్లాలో కొందరు ఎంపీడీవోల తీరిది
ఉన్నతాధికారుల మౌనంపై అనుమానాలు
- విజయనగరం డివిజన్‌కు సంబంధించి ఓ ఎంపీడీవో జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే కొత్తకారు కొనుగోలు చేసుకున్నారు. ప్రతిరోజూ జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తూ సాయంత్రం ఇంటికి వెళ్లిపోతారు. కార్యాలయానికి వచ్చిపోయేటప్పుడు కారులో తిరిగే రీడింగ్‌ను గ్రామాల పర్యటనకు వెళ్లినట్లు చూపిస్తున్నారు. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే రూ.35వేలు.. కారుకు ఈఎంఐకి వినియోగించుకుంటున్నారు.
- విజయనగరం డివిజన్‌కే చెందిన మరో ఎంపీడీవో తాను విధులు నిర్వహించే మండలంలోనే నివాసం ఉంటున్నారు. కారు ఎప్పుడూ కార్యాలయంలో ఉంటుంది. దగ్గరగా ఉన్న సచివాలయాలకు బైకుపై వెళ్లి వస్తుంటారు. వారానికి రెండు రోజులు కూడా కారులో తనిఖీలకు వెళ్లడం గగనం. అయినా వాహన బిల్లులను చక్కగా తీసుకుంటున్నారు.
- చీపురుపల్లి డివిజన్‌కు సంబంధించి ఓ ఎంపీడీవో జిల్లా కేంద్రం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. మండల పరిధిలో జరిగే కార్యక్రమాలకు కార్లమీద హాజరయినా కాకపోయినా బిల్లులు మాత్రం యథావిధిగా డ్రా చేసుకుంటున్నారు.
గజపతినగరం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు ఎంపీడీవోలు ప్రభుత్వ నిధులను అడ్డదారిలో పొందుతున్నారు. వారికి మండల స్థాయి అధికారిగా ఉంటున్నందుకు ప్రభుత్వం ఇస్తున్న వాహన బిల్లులను వాహనం వాడకుండానే జేబులో వేసుకుంటున్నారు. ఇంకొందరు ఇంటి నుంచి విధులకు హాజరయ్యే ప్రయాణాన్ని తనిఖీలకు వెళ్లినట్లు చూపించుకుంటున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం పనులు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర శాఖల సిబ్బంది పనితీరుపై ఎంపీడీవోలు నిరంతరం తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నెలకు 20 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అందుకు గాను ఒక్కో ఎంపీడీవోకు ప్రభుత్వం నెలకు వాహన బిల్లు కింద రూ.35వేలు మంజూరు చేస్తోంది. జిల్లాలో 27 మంది ఎంపీడీవోలకు గాను నెలకు రూ.9లక్షల45 వేలు నిధులు విడుదల అవుతాయి. అయితే కొంతమంది ఎంపీడీఈవోలు పర్యటనకు వెళ్లకుండా బోగస్ బిల్లులతో డ్రాచేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది కార్యాలయాలకే పరిమిత మవుతున్నారు. ఒక్కరోజు కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని ఆశాఖ వర్గాలు అంటున్నాయి. అయినా బిల్లులు పూర్తిస్థాయిలో డ్రా చేస్తున్నట్లు సమాచారం. వ్యవహారం మొత్తం ఉన్నతాధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారులకు సైతం ఇందులో కమీషన్ వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కొన్ని మండలాల్లో ఎంపీడీవోలు ఒక అడుగు ముందుకు వేసి అటెండర్‌లనే కారు డ్రైవర్‌లుగా వినియోగించు కుంటున్నారు. కార్యాలయంలో సేవలు అందజేయాల్సిన అటెండర్‌లు కారు డ్రైవర్‌లుగా మారి విధులు నిర్వహించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
- ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లకపోవడంతో ఉపాధి పనులు పక్కదారి పడుతున్నాయి. అంగన్వాడీలు, సచివాలయాల సిబ్బంది దారి తప్పుతున్నారు. ఎంపీడీవో రాడులే అన్న ధీమాతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ఎంపీడీవోలు అడ్డదారుల్లో బోగస్ బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసుకుంటున్నారు. ఈఅక్రమ వ్యవహారాల్లో ట్రెజరీ, జిల్లా పంచాయతీ అధికారులకు సైతం కమీషన్‌లు ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఎంపీడీవోలు క్షేత్రస్థాయికి వెళ్లేలా చూడాల్సి ఉంది.
విచారించి చర్యలు తీసుకుంటాం
ఎంపీడీవోలు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే బోగస్ వాహన బిల్లులు డ్రా చేసుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిధుల స్వాహా జరిగినట్లు నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలుంటాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
- ఎ.లోవరాజు, జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవో
==================