Share News

VBG Ramji జూలై 1 నుంచి వీబీ జీ రామ్‌జీ అమలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:25 AM

VBG Ramji to Be Implemented from July 1 దాదాపు రెండు దశాబ్దాల ఉపాధి హామీ పథకం పేరు మరికొద్దిరోజుల్లో మారనుంది. ఈ పథకంలో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జిల్లాలో జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

 VBG Ramji  జూలై 1 నుంచి   వీబీ జీ రామ్‌జీ  అమలు

పార్వతీపురం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): దాదాపు రెండు దశాబ్దాల ఉపాధి హామీ పథకం పేరు మరికొద్దిరోజుల్లో మారనుంది. ఈ పథకంలో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జిల్లాలో జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీబీ జీ రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ) ప్రకారం వేతనదారులకు పనులు మంజూరు, వేతనాల చెల్లింపులు జరగనున్నాయి. జిల్లాలో 2.01 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిల్లో 1.93 లక్షల జాబ్‌ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజుకు సుమారు రెండు లక్షల మందికిపైగానే వేతనదారులు పనులు చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో గతంలో జాబ్‌ కార్డుకు వంద రోజులు మాత్రమే పని దినాలు కల్పించేవారు. వీబీ జీ రామ్‌జీ పథకం ప్రకారం ఇకపై ఏడాదిలో 125 రోజుల పాటు పనిదినాలు కల్పించనున్నారు. ఇక జిల్లాలో ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏపీవోలు, ఇంజనీరింగ్‌, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇకపై వీరందరూ ఇకపై వీబీ జీ రామ్‌జీ పథకం కిందకు రానున్నారు. ఈ మేరకు వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. హోదా కూడా మార్పు చేశారు. ఇకపై కంప్యూటర్‌ ఆపరేటర్‌ , అకౌంట్స్‌ అసిస్టెంట్లు డిజిటల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అసిస్టెంట్లుగా మారనున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను గ్రామీణ రోజ్‌గార్‌ సహాయక లేదా గ్రామ కాయకల్ప సహాయక్‌గా, టెక్నికల్‌ అసిస్టెంట్లను రూరల్‌ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ అసోసియేట్‌గా పిలవనున్నారు. ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లను మిషన్‌ ఇంజనీరింగ్‌ అసోసియేట్‌గా మారనున్నారు. అడిషనల్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల హోదా అసిస్టెంట్‌ మిషన్‌ మేనేజర్‌గా మారనుంది. ఈ విధంగా ఉద్యోగుల హోదాను మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

- మస్తర్‌ వేసిన 15 రోజుల్లోగా వేతనదారుల ఖాతాలో తప్పనిసరిగా వేతనాన్ని జమ చేస్తారు. ఆలస్యమైతే, తగిన పరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉంది. ఉపాధి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికీ 15 రోజుల్లోగా పని కల్పించాలి. లేకుంటే సదరు వ్యక్తి నిరుద్యో భృతి చెల్లించాల్సి ఉంది. ఈ పథకం అమలుకు గ్రామాలను ఏబీసీ మూడు కేటగిరీలుగా విభజిస్తారు. పనులకు సంబంధించి ఎప్పటిలానే పంచాయతీలే ప్రణాళికలు తయారు చేసి, అమలు చేయాలి. పనులు కావాల్సిన వారికి గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డులను (ఇప్పుడున్న జాబ్‌ కార్డుల స్థానంలో) గ్రామ పంచాయతీలే మంజూరు చేస్తాయి.

-ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లుపై బడిన వారు, ట్రాన్స్‌ జెండర్లకు ప్రత్యేక గ్రామీణ కార్డులు అందజేస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి సామాజిక తనిఖీ నిర్వహించేలా చట్టంలో మార్పులు చేశారు. పనులు, వేతనాలు, మస్టర్‌ రోల్స్‌, చెల్లింపుల వివరాలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించడం తప్పనిసరి చేశారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ రెడ్రసల్‌ వ్యవస్థ, అంబుడ్స్‌ పర్సన్‌ వ్యవస్థ అమల్లో ఉంటుంది. పర్యవేక్షణ, జరిమానాలు, మూల్యంకనం, తనిఖీలు, నష్టపరిహారం వసూలు, శిక్షణలకు సంబంఽ దించిన నిబంధనలు కూడా పొందుపరచడం ఈ కొత్త చట్టంలోని ప్రత్యేకత.

- ఉపాధి హామీ పథకంలో వేతనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు అందించేది. మెటీరియల్‌, నిర్వహణ వ్యయంలో 75 శాతం నిధులను కూడా కేంద్రం అందించేది. అయితే వీబీజీ రామ్‌జీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వ్యయంలో 60:40 నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తాయి.

Updated Date - Jun 25 , 2026 | 12:25 AM