VBG Ramji జూలై 1 నుంచి వీబీ జీ రామ్‌జీ
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:50 PM
VBG Ramji from July 1 కేంద్రం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జిల్లాలో జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) ప్రకారం వేతనదారులకు పనులు మంజూరు, వేతనాల చెల్లింపులు జరగనున్నాయి.
ఉపాధి హామీ పథకంలో మార్పులు
వేతనదారులకు పెరగనున్న పనిదినాలు
60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మంజూరు
పార్వతీపురం, జూన్5(ఆంధ్రజ్యోతి): కేంద్రం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జిల్లాలో జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) ప్రకారం వేతనదారులకు పనులు మంజూరు, వేతనాల చెల్లింపులు జరగనున్నాయి. జిల్లాలో 2.01 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిల్లో 1.93 లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజుకు సుమారు రెండు లక్షల మందికిపైగానే వేతనదారులు పనులు చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో గతంలో జాబ్‌కార్డుకు వంద రోజులు మాత్రమే పని దినాలు కల్పించేవారు. వీబీ జీ రామ్‌జీ పథకం ప్రకారం ఇకపై ఏడాదిలో 125 రోజుల పాటు పనిదినాలు కల్పించనున్నారు. ఇక జిల్లాలో ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు ఏపీవోలు, ఇంజనీరింగ్, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇకపై వీరందరూ ఇకపై వీబీ జీ రామ్‌జీ పథకం కిందకు రానున్నారు.
పెరగనున్న రాష్ట్ర ప్రభుత్వ వాటా
ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు, వేతనాల చెల్లింపులకు కేంద్రం పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు చేసేది. మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టే పనులకు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో నిధులు భరించేవి. అయితే ఇకపై కేంద్రం వాటా తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా పెరగనుంది. వీబీ జీ రామ్‌జీ పథకం కింద చేపట్టనున్న పనులు, వేతనాల చెల్లింపులకు సంబంధించి కేంద్రం 60 శాతం , రాష్ట్ర సర్కారు 40 శాతం కింద నిధులు మంజూరు చేయనున్నాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది.
వచ్చేనెల నుంచి అమలు
జూలై 1 నుంచి వీబీ జీ రామ్‌జీ పథకం జిల్లాలో అమలు కానుంది. కొత్త పథకం నిబంధనల మేరకు పనులు మంజూరుతో పాటు వేతనాల చెల్లింపులు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మేర నిధులు మంజూరు చేయనున్నాయి.
- రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం