Share News

‘Vanitha’ is truly delightful. ‘వనిత’రసాధ్యమే

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:10 AM

‘Vanitha’ is truly delightful. కాలేజీలకు వెళ్లాలంటే బస్టాండ్‌ వరకూ నాన్న దింపాలి. పిల్లలను పాఠశాల నుంచి తీసుకురావాలంటే భర్త ఆఫీసు నుంచి వచ్చేదాకా ఆగాలి... మార్కెట్‌కు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలంటే మరొకర్ని లిఫ్టు అడగాలి ..ఇలా అన్నింటికీ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని మహిళలు భావిస్తున్నారు.

‘Vanitha’ is truly delightful. ‘వనిత’రసాధ్యమే

‘వనిత’రసాధ్యమే

బైక్‌ డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంటున్న మహిళలు

విద్యార్థినులు, యువతులు సైతం

ఇంటి అవసరాలతో పాటు ఉపాధికి వినియోగం

విజయనగరంలో పెరుగుతున్న డ్రైవింగ్‌ స్కూళ్లు

దాసన్నపేట, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి):

కాలేజీలకు వెళ్లాలంటే బస్టాండ్‌ వరకూ నాన్న దింపాలి. పిల్లలను పాఠశాల నుంచి తీసుకురావాలంటే భర్త ఆఫీసు నుంచి వచ్చేదాకా ఆగాలి... మార్కెట్‌కు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలంటే మరొకర్ని లిఫ్టు అడగాలి ..ఇలా అన్నింటికీ ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని మహిళలు భావిస్తున్నారు. చిన్నచిన్న అవసరాలకు తామే ఎందుకు వెళ్లకూడదని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు. డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. పిల్లలను స్కూల్‌ బస్సుల్లో కాకుండా తామే ద్విచక్ర వాహనంపై దింపుతున్నారు. సొంత అవసరాలకు కూడా బండి డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళుతున్నారు. విజయనగరం మహిళల్లో ఈ తరహా చైతన్యం బాగా పెరిగింది. డ్రైవింగ్‌ నేర్చుకోవాలన్న మహిళల ఆసక్తిని చూసి డ్రైవింగ్‌ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి

అప్పట్లో ఉన్నత వర్గాలు..

గతంలో డ్రైవింగ్‌ నేర్చుకునే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కేవలం ఉద్యోగినులు, ఉన్నత శ్రేణి వర్గానికి చెందిన వారు మాత్రమే బైక్‌, కారు డ్రైవింగ్‌ నేర్చుకునేవారు. ఇప్పుడు అలా కాదు. గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు సైతం బైక్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. డ్రైవింగ్‌ స్కూళ్లలో చేరుతున్నారు. ప్రస్తుతం విజయనగరంలో డ్రైవింగ్‌ స్కూళ్లు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా మహిళల కోసమే ఏర్పాటుచేస్తున్నారు. గతంలో ఓ బ్యాచ్‌కు ఒకరిద్దరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 10 మందికి తగ్గడం లేదని స్కూల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే కాదు. ఉపాధి అవకాశాల కోసం ఎక్కువ మంది డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు.

పల్లెలకూ విస్తరించిన సంస్కృతి

గతంలో పట్టణాల్లో ఉండే మహిళలు డ్రైవింగ్‌ నేర్చుకునేవారు. నేడు ఈ సాంస్కృతి పల్లెలకూ విస్తరించింది. ప్రతి ఇంట్లోనూ స్కూటీ రూపంలో వాహనం అందుబాటులోకి వచ్చింది. ఆపై ఎలక్ర్టిక్‌ వాహనాలు వచ్చాయి. దీంతో ఇంట్లోని మహిళలు సైతం ఎక్కువగా డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం విజయనగరంలో ర్యాపిడో వంటి బైక్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మహిళలు సైతం ఉపాధికి చేరుతున్నారు. దీనికితోడు ఆహారంతో పాటు నిత్యావసరాల డోర్‌ డెలివరీ సేవలు పెరిగాయి. ఈ పనిలో సైతం మహిళలు చేరుతున్నారు.

పెరిగిన ఆసక్తి

గతం కంటే మహిళలు డ్రైవింగ్‌ ఎక్కువగా నేర్చుకుంటున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నేర్చుకుంటున్నవారు ఉన్నారు. డ్రైవింగ్‌ స్కూళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఇంటి అవసరాల కోసం గృహిణులు, ఉపాధి కోసం యువతులు వచ్చి డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. యవతలే కాదు..40 ఏళ్లదాటిన వారు కూడా డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు.

- లక్ష్మీ, డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకురాలు, విజయనగరం

ఇతరులపై ఆధారపడకుండా..

ఏ చిన్న అవసరానికైనా ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నాను. పిల్లలను స్కూళ్లో డ్రాప్‌ చేసేందుకు.. ఇంటికి అవసరమైన నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు భర్తతో పాటు ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్‌ తప్పనిసరి. ఇది కేవలం సౌకర్యం కాదు అవసరం కూడా.

- భవాని, డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న మహిళ, పూసపాటిరేగ

-----------

Updated Date - Sep 18 , 2026 | 12:10 AM