వ్యాను బోల్తా.. ఒకరి మృతి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:12 AM
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యాను బోల్తా పడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బొండపల్లి, మార్చి 20(ఆంధ్ర జ్యోతి): విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యాను బోల్తా పడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలంలోని కొళ్లాయివలస గ్రామానికి చెందిన వ్యానులో అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తూ.. గజపతినగరంలో కాంక్రీటు మిక్సర్ మిషన్‌ను వాహనం లో ఎక్కించుకుని వస్తున్నారు. ఆ వ్యాను రోళ్లవాక జంక్షన్ వద్దకు వచ్చేసరికి, జాతీయ రహదారి పక్కనగల విద్యుత్ స్తంభాన్ని అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన నీలాపు రామసూరి(40) అక్కడికక్కడే రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందినట్లు తెలిపారు. ఇదే ప్రమా దంలో అదే గ్రామానికి చెందిన కాకి అసిరప్పడు, లావేటి అసిరినాయుడు, కంప పైడిరాజుతోపాటు వ్యాన్ డ్రైవర్ పాడి రాజేంద్రలు గాయపడ్డారు. గాయపడిన నలుగురిని 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించారు. రామసూరి మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.