Share News

ఫాస్టాగ్‌పై వడ్డన!

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:44 PM

వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకు సంబంధించి ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ ఫీజును నేషనల్‌ హైవేస్‌ అథర్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పెంచేసింది.

 ఫాస్టాగ్‌పై వడ్డన!

- వార్షిక పాస్‌ ఫీజు పెంపు

- రూ.3వేల రూ.3,075కు పెరిగిన వైనం

- ఇప్పటికే అమలు చేస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ

- వాహనదారుల విస్మయం

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకు సంబంధించి ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ ఫీజును నేషనల్‌ హైవేస్‌ అథర్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పెంచేసింది. ఇంతవరకు రూ.3వేల ఉన్న ఫీజును రూ.3,075 చేసింది. ఈ పెంచిన ధరను ఈ నెల ఒకటో తేదీ నుంచే అమలు చేస్తోంది. అదే విధంగా పూర్తి స్థాయిలో నగదు రహిత చెల్లింపులను అనుమితించనుంది. టోల్‌ ప్లాజాల నుంచి వెళ్లే ప్రతి వాహనం దీన్ని విధిగా పాటించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఫాస్టాగ్‌ పాస్‌ పొందిన వాహనదారులు దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న 1150 టోల్‌ ప్లాజాల గుండా ప్రయాణించవచ్చు. ఈ పాస్‌ ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్‌ క్రాసింగ్‌ల వరకు ఏది ముందుగా అయితే దాని వరకు చెల్లుబాటు అవుతుంది. ఫాస్టాగ్‌ను ప్రవేశ పెట్టిన ఎనిమిది నెలల్లోనే ఫీజు రేటును రూ.75కు పెంచేయడంపై వాహనదారులు విస్మయం చెందుతున్నారు.

నగదు రహిత చెల్లింపు..

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ గేట్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతో 2025 ఆగస్టులో ఫాస్టాగ్‌ విధానాన్ని ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించింది. అప్పట్లో ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ ఫీజును రూ.3వేలుగా నిర్ణయించింది. ఈ విధానం ద్వారా టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకపోవడంతో వాహనదారులు ఫాస్టాగ్‌ పాసులను తీసుకునేందుకు ఇష్టపడేవారు. వాస్తవానికి టోల్‌గేట్ల వద్ద వాహనం నిలిపి ఫీజు కడితే రూ.30 అవుతుంది. అదే ఫాస్టాగ్‌ పాస్‌ ఉంటే రూ.15 కట్‌ అవుతుంది. నగదు ఆదా కనిపిస్తుండడంతో ఫాస్టాగ్‌పై వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారుల్లో అత్యధిక శాతం మంది ఫాస్టాగ్‌ పాస్‌లను కలిగి ఉంటున్నారు. అయితే ఇకమీదట టోల్‌ ప్లాజాల వద్ద పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలను మాత్రమే అనుమతించాలన్న కేంద్ర నిర్ణయంతో ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో నాలుగు టోల్‌ ప్లాజాలు..

జిల్లాలో నాలుగు టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. జాతీయ రహదారి-26పై విజయనగరం మండలం జొన్నాడ వద్ద, దత్తిరాజేరు మండలం మానాపురం వద్ద టోల్‌గేట్లు ఉన్నాయి. ఈ రహదారి విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా మీదుగా ఉంటుంది. రామభద్రపురం మండలంలో రెండుగా చీలుతుంది. ఒకటి ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాకు, మరొకటి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంది. విశాఖ-అరకు జాతీయ రహదారి, అరకు నుంచి వచ్చే జాతీయ రహదారిని కలిపే బొడ్డవర కూడలి నుంచి విజయనగరం వరకు ఉన్న జాతీయ రహదారి-516లో కొర్లాం- గంట్యాడ మధ్య టోల్‌ ప్లాజా ఉంది. దీనిపై ప్రయాణం చేసే వాహనాలు విశాఖపట్నం నుంచి రాయపూర్‌ జాతీయ హరిత రహదారికి మరలవచ్చు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంకు వెళ్లే జాతీయ రహదారి-16లో విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస వద్ద టోల్‌ ప్లాజా ఉంది. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా మీదుగా నిర్మించిన రాయపూర్‌ జాతీయ హరిత రహదారిపై జామి, గంట్యాడ, గజపతినగరం మండలాల పరిధిలో టోల్‌ ప్లాజాలను నిర్మించారు. కానీ, వాటిని ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇవన్నీ ఎన్‌హెచ్‌ఏఐ ఆధీనంలో నడుస్తున్నాయి.

Updated Date - Apr 03 , 2026 | 11:44 PM