Share News

Vacancies in KGBVs కేజీబీవీల్లో ఖాళీలు

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:13 AM

Vacancies in KGBVs వేసవి సెలవులు ముగిశాయి. విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కానీ కేజీబీవీల్లో మాత్రం ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. పేద, సామాన్య వర్గాల విద్యార్థినుల కోసం ప్రభుత్వం కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ)లను ఏర్పాటుచేసింది.

Vacancies in KGBVs కేజీబీవీల్లో ఖాళీలు

కేజీబీవీల్లో ఖాళీలు

ఆరోతరగతి, ఇంటర్‌లో భర్తీ కాని సీట్లు

వసతి, ఉత్తమ బోధన అందుతున్నా నిరాసక్తత

అవగాహన కల్పించడంలో అధికారుల విఫలం

వేసవి సెలవులు ముగిశాయి. విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కానీ కేజీబీవీల్లో మాత్రం ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. పేద, సామాన్య వర్గాల విద్యార్థినుల కోసం ప్రభుత్వం కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ)లను ఏర్పాటుచేసింది. తల్లిదండ్రులు లేకపోయినా, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినా తమ పిల్లలను వీటిలో చేర్చవచ్చు. అటువంటి పిల్లలకు వసతితో కూడిన విద్య అందించేందుకు 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పాఠశాలలను ప్రారంభించాయి. వసతి, ఉత్తమ బోధన అందుతున్నా విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల్లో ఎందుకో నిరాసక్తత నెలకొంది. వారి సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.

రాజాం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ)లు ఉన్నాయి. తొలుత 6 నుంచి పదో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలను రెండు సంవత్సరాల కిందట ఇంటర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు ప్రత్యేక సాంకేతిక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కేజీబీవీలో ఒక్కో కోర్సు అందుబాటులో ఉంది. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీతో పాటు కంప్యూటర్‌, టాలీ వంటి వృత్తివిద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. నాణ్యమైన బోధన, వసతి, మెనూ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా విద్యార్థినులు అక్కడ చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదు. తమ మండలాల్లో ఇటువంటి పాఠశాలలు ఉన్నాయని చాలా మంది తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరు, ఇంటర్‌లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీలకు సైతం దరఖాస్తులు ఆహ్వానించారు. చాలా కేజీబీవీల్లో సగం సీట్లు కూడా నిండని పరిస్థితి ఉంది. భర్తీ కోసం ఈ పాఠశాలల ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రామాల్లో డ్రాపౌట్స్‌ను, విద్యార్థినుల తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించినా పాఠశాలల్లో చేరేందుకు వారు ముందుకు రావడం లేదు. సంతకవిటి కేజీబీవీలో ఇంటర్‌ సీఈసీ గ్రూపులో 21 మంది ప్రవేశం పొందారు. రేగిడి మండలం పుర్లి కేజీబీవీలో ఒకేషనల్‌ కోర్సులో 24 మంది మాత్రమే ప్రవేశం పొందారు. ఇది ఉదాహరణలు మాత్రమే. చాలా కేజీబీవీల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.

ఫ కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్‌ వరకూ విద్య అందిస్తున్నారు. ప్రతీ తరగతిలో 40 సీట్లు ఉంటాయి. సబ్జెక్టుల వారీగా మహిళా ఉపాధ్యాయులు (సీఆర్టీలు)ను నియమించారు. నిరంతర వైద్య సేవల కోసం ఒక ఏఎన్‌ఎం సైతం అందుబాటులో ఉంటుంది. బోధనేతర సిబ్బంది, చివరకు స్వీపర్లు, వాచ్‌మెన్‌ సైతం మహిళలే ఉంటారు. బాలికా రక్షణకు పెద్దపీట వేస్తూ ఏర్పాటుచేసిన ఈ పాఠశాలలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్న ప్రభుత్వాలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయి.

వసతులు ఉన్నా

కేజీబీవీ పాఠశాలల్లో పౌష్టికాహారంతో పాటు అన్నిరకాల వసతులు అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటుంది. మధ్యలో స్నాక్స్‌, బూస్టు, హార్లిక్స్‌, పాలు కూడా అందిస్తారు. రోజుకో మెనూ ఉంటుంది. ఎంపిక చేసిన రోజుల్లో మాంసాహారం అందిస్తారు. కోడిగుడ్లు పెడతారు. స్నాక్స్‌లో బెల్లం చక్కీలు అందిస్తారు. రాత్రి భోజనం తరువాత పండ్లు, పాలు పెడతారు. యూనిఫారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అందిస్తారు. కంప్యూటర్‌ బోధన, స్టైఫండ్‌, గ్రంథాలయ సేవలు, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహం, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి యోగా సైతం నేర్పిస్తారు. బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా అన్ని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు.

ఇవీ సమస్యలు

సమగ్ర శిక్ష విభాగం పరిధిలో ఉండే ఈ పాఠశాలల్లో నిధుల ఖర్చు విషయంలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పాఠశాలల నిర్వహణకుగాను ప్రత్యేకాధికారుల ఖాతాల్లో నిధులు ఉంటాయి. వాటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసుకునే వెసులబాటు ఉంది. ఈ అధికారాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. వాస్తవానికి పాఠశాలల్లో సీఆర్‌టీలు తప్పనిసరిగా ఉండాలి. రోజుకొకరు చొప్పున రాత్రి విధులు నిర్వహించాలి. తప్పకుండా ప్రత్యేకాధికారి పాఠశాలలోనే ఉండాలి. కానీ చాలా పాఠశాలల్లో ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చాలా పాఠశాలలకు ఇప్పటికీ ప్రత్యేకాధికారులు లేరు. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. సీఆర్‌టీలు కూడా పూర్తిస్థాయిలో లేరు. ఇంటర్‌కు సంబంధించి అధ్యాపకులు కూడా తగినంతమంది లేరు. కొత్త నియామకాలు చేపట్టడంలేదు.

కంటికిరెప్పలా చూసుకుంటున్నాం

కేజీబీవీ పాఠశాలల్లో ఉత్తమ విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నాం. బాలికా రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రుల మాదిరిగానే వారిని కంటికిరెప్పలా చూసు కుంటున్నాం. ఈ విషయం తల్లిదంద్రులు గమనించాలి. తల్లిదండ్రులు లేకపోయినా, వలసవెళ్లినా ఆ పిల్లలు కేజీబీవీల్లో చేరేందుకు ముందుకు రావాలి.

- సావిత్రి, ప్రత్యేకాధికారి, కేజీబీవీ, రాజాం

-----------------

Updated Date - Jun 14 , 2026 | 12:13 AM