ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్ భోగాపురం విమానాశ్రయం
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:45 AM
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి నిజమైన గ్రోత్ ఇంజన్‌లా పని చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్‌ను తలపించేలా అభివృద్ధి: మంత్రి కొండపల్లి
ప్రధాని సభకు 3 లక్షల మంది: పల్లా
విశాఖపట్నం/విజయనగరం/భోగాపురం/అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి నిజమైన గ్రోత్ ఇంజన్‌లా పని చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేనెల 1న ప్రాంరభోత్సవం నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘భూమి నుంచి భవిషత్తు వరకు’ అనే పేరుతో విజయనగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు శనివారం వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో ఈర్యాలీని మంత్రి కొండపల్లి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భోగాపురంలో విలేకరులతో మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం వల్ల స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు తరువాత హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో అదేస్థాయిలో ఇక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి చెందాలంటూ రామతీర్థం శ్రీరామస్వామివారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
17 నుంచి భోగాపురంలో కార్యకలాపాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. శనివారం విశాఖ కలెక్టరేట్‌లో జిలా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆగస్టు ఒకటో తేదీన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని, అయితే 17వ తేదీ నుంచి వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. ప్రారంభోత్సవంలో ప్రజలు భాగస్వాములై ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ప్రధాని సభకు మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ఉత్తరాంధ్ర వైభవంపై విస్తృత ప్రచారం
ఉత్తరాంధ్ర ప్రజల విమానాశ్రయ కల సాకారమవుతున్న వేళ ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ పేరుతో ఆరు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఆ జిల్లాల్లో ప్రారంభోత్సవ కౌంట్ డౌన్ డిజిటల్ స్ర్కీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 1వరకూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో విద్యార్థుల కోసం ‘మై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్’ అంశంపై క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ప్రధాని సభలో సీటు కేటాయిస్తామని వివరించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, ఆర్కే బీచ్‌లో మారథాన్, సైక్లథాన్, ప్లాష్ మాబ్‌తో పాటు ఉత్తరాంధ్ర వైభవాన్ని ప్రతిబింబించే భారీ డ్రోన్ షో నిర్వహిస్తామని విశ్వనాథన్ వివరించారు.
13 వేల మందితో ధింసా నృత్యం
విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ శనివారం తెలిపారు. ఉత్తరాంధ్ర కళల ప్రదర్శనలో భాగంగా 13 వేల మంది గిరిజనులతో ధింసా నృత్యం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్ పాల్గొంటారని తెలిపారు. గత ఏడాది విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 వేల మంది గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధింసా కూడా గిన్నిస్ రికార్డుతో ప్రపంచ గుర్తింపు పొందనుంది.
కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ రూ.4,592వేల కోట్లతో నిర్మితమైన ఈ ఎయిర్ పోర్టు ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానం చేరవేసే సామర్థ్యంతో పని చేస్తుందన్నారు. భవిషత్తులో ఏడాదికి 4 కోట్ల మందికి సేవలందించేలా ఉంటుందన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15వేలు, పరోక్షంగా 5.85 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎస్పీ ఏఆర్ దామోదర్, జెసీ సేథుమాధవన్, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలితకుమారి, లోకం నాగమాధవి, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
పటిష్ఠ భద్రతకు సీసీ కెమెరాలు
విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి
భోగాపురం, జూలె ౖ25(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి పర్యటనలో ముందస్తు చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్‌జెట్టి అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును ఆయన శనివారం సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అవసరమైన ప్రతీచోట సీసీ కెమోరాలు అమర్చాలన్నారు. భద్రతలో బాగంగా ట్రంపెట్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఎయిర్ పోర్టు టెర్మినల్, ట్రంపెట్, సభావేదిక ప్రాంతం, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు ఏఆర్ దామోదర్, ఎస్‌వీ మాధవరెడ్డి, అమిత్ బర్ఢర్, మైరెన్ ఎస్పీ శ్రావణి, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు అంతకుముందు ఎస్పీ దామోదర్ ఎయిర్‌పోర్టులో పోలీసు సిబ్బందితో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.