Urban forests need to be developed. నగరవనాలను అభివృద్ధి చేయాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:28 AM
Urban forests need to be developed. అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు అటవీ శాఖ స్థలాల్లో నగరవనాలను ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతి జిల్లాలో 50 హెక్టార్లను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచించారు.
నగరవనాలను అభివృద్ధి చేయాలి
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
ప్రతి జిల్లాలో 50 హెక్టార్లను కేటాయించాలి
కొండవెలగాడలో వర్చువల్‌గా చంపవనం ప్రారంభం
నెల్లిమర్ల, జూలై 1(ఆంధ్రజ్యోతి): అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు అటవీ శాఖ స్థలాల్లో నగరవనాలను ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతి జిల్లాలో 50 హెక్టార్లను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచించారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో అటవీ శాఖ స్థలంలో రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన చంపవనం పార్కును ఆయన బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి ఆయన మాట్లాడుతూ అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు అటవీ ప్రాంతాల్లో నగరవనాల ఏర్పాటు ద్వారా ప్రజల మనో వికాసానికి తోడ్పడాలని సూచించారు. ఎకో టూరిజంను అభివృద్ధి చేయాలన్నారు. నగర వనాల ద్వారా ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా అటవీశాఖ అధికారి సోమసుందర్, అటవీ రేంజ్ అధికారి బిర్లంగి రామ్ నరేష్ మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పార్కులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సారిపల్లి ఐడీఏ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నగర వనం తరహాలోనే చంపవనం కూడా అన్ని హంగులతో ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్కులో సంపంగి వనాలు, నక్షత్ర వనం, రాసివనం, పిల్లల అడ్వెంచర్ పార్కు, వాకింగ్, జాగింగ్ పాత్‌లు, పక్కనే ఉన్న కొండపైకి వెళ్లేందుకు ట్రెక్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. 20వేల మొక్కలతో నర్సరీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కార్యక్రమంలో సామాజిక వన విభాగం రేంజర్ అధికారులు ఎన్‌విఎస్‌ఎన్.రాజు, సింధు, అటవీశాఖ ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు కేవీఎన్.రాజు, కేశవ, గార్డ్ బి.రాజేశ్వరి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.