Share News

Urban Development .. గాడిలో పెడితేనే.. ‘పుర’ అభివృద్ధి

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:13 AM

Urban Development Only If Put Back on Track… జిల్లాలోని పురపాలక సంఘాల్లో అనేక సమస్యలు తిష్ఠవేశాయి. ప్రధానంగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Urban Development ..  గాడిలో పెడితేనే..  ‘పుర’ అభివృద్ధి
ట్యాంకర్‌ వద్ద వాటర్‌ పట్టుకుంటున్న పార్వతీపురం పట్టణవాసులు

  • క్షీణించిన పారిశుధ్యం

  • నేడు జిల్లాలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పర్యటన

  • చొరవ చూపాలంటున్న జిల్లావాసులు

పార్వతీపురం, ఏప్రిల్‌4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పురపాలక సంఘాల్లో అనేక సమస్యలు తిష్ఠవేశాయి. ప్రధానంగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు జిల్లాకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ జిల్లాకు రానున్నారు. తొలుత పాలకొండ, పార్వతీపురం పురపాలక సంఘాల్లోని అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాల్టీవాసులు ఆయనపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు.

జిల్లాలో సమస్యలివీ..

పాలకొండ నగర పంచాయతీలో రహదారుల విస్తీర్ణంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అదేవిధంగా పార్వతీపురం మున్సిపాల్టీ వాసులను దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కార మార్గం చూపించాల్సి ఉంది. ఈ విషయంలో గత వైసీపీ పాలకులు హామీలకే పరిమితమయ్యారు. శిలఫలకాలు వేసి మమ అనిపించారు. కాగా జిల్లాకేంద్ర వాసులు అన్ని కాలాల్లోనూ తాగునీటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. వేసవిలో నాలుగైదు రోజులొకకసారి నీటిని సరఫరా చేస్తుండగా.. శివారు ప్రాంతవాసులకు ట్యాంకర్లే దిక్కు. ఇక శీతాకాలం, వర్షాకాలంతో ప్రజలు బురదనీటినే తాగాల్సి వస్తోంది. దీంతో తరచూ వారు రోగాలబారిన పడి ఆసుపత్రిపాలవ్వాల్సి వస్తోంది. ఇక పట్టణంలో పారిశుఽధ్య నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. పట్టణవాసులకు దోమల బెడద తప్పడం లేదు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం మెరుగకు గత టీడీపీ హయాంలో ప్రయత్నాలు జరిగినా.. ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది.. ఇకపోతే పట్టణవాసులకు బైపాస్‌ రహదారి కలగానే మిగిలిపోయింది. డంపింగ్‌యార్డు తరలింపు హామీలకే పరిమితమైంది. ఇక సాలూరు పట్టణ వాసులు కూడా తాగునీరు, పారిశుధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పురపాలక సంఘాల్లో అవినీతిపై కూడా మంత్రి దృష్టి సారించాల్సి ఉంది. ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:13 AM