Uproar over spurious seeds in Jakkuva! జక్కువలో నకిలీ విత్తన కలకలం !
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:18 AM
Uproar over spurious seeds in Jakkuva! జక్కువ గ్రామంలో వరి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు నమ్మి 300 ఎకరాల్లో వేస్తే 60 శాతం పంటలో కేళీలు వచ్చాయి. ఈ పరిణామంపై సుమారు 70 మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. నట్టేట మునిగామని వాపోతున్నారు.
జక్కువలో నకిలీ విత్తన కలకలం !
రైతు సేవా కేంద్రంలో కొనుగోలు
300 ఎకరాల్లో సాగు
60 శాతానికి పైగా కేళీలు
70 మంది రైతుల గగ్గోలు
మెంటాడ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి):
జక్కువ గ్రామంలో వరి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు నమ్మి 300 ఎకరాల్లో వేస్తే 60 శాతం పంటలో కేళీలు వచ్చాయి. ఈ పరిణామంపై సుమారు 70 మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. నట్టేట మునిగామని వాపోతున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో జక్కువ గ్రామానికి చెందిన సుమారు 70 మంది రైతులు స్థానిక రైతు సేవా కేంద్రంలో కొనుగోలు చేసిన 11:21 రకం వరి విత్తనాలతో 300 ఎకరాల్లో సాగు చేశారు. పంట మొలకెత్తిన కొద్దిరోజులకే అసలు విషయం బయటపడింది. దుబ్బులు పెరిగాక అందులో కొన్నింటికి మాత్రమే గింజ రావడం, 60 శాతం దుబ్బులకు గింజ లేకపోవడంతో రైతులు కేళీలుగా గుర్తించారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, అప్పులు చేసి సాగు చేస్తే ఇలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్కన ప్రకృతి వైపరీత్యం వల్ల వర్షాలు లేకపోవడంతో బోర్లు ద్వారా నీరు తడి అందించి పంటను కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసిన విత్తనాలను నమ్మకంతో వేశారు. ఇప్పుడు పంట సరిగా లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధిత రైతులు మండల వ్యవసాయాధికారి గోకుల కృష్ణకు ఫిర్యాదు చేయగా, పొలాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, నకిలీ విత్తనాల సరఫరాపై విచారణ జరిపి పరిహారం ఇప్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.