Share News

Eklavya School కురుపాం ‘ఏకలవ్య’లో కలకలం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:12 AM

Uproar at Kurupam Eklavya School కురుపాం ఏకలవ్యలో కలకలం రేగింది. ఈ పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థినికి అబార్షన్‌ అయినట్లు ఆలస్యంగా తెలిసింది.

 Eklavya School కురుపాం ‘ఏకలవ్య’లో కలకలం

పార్వతీపురం, జూలై4(ఆంధ్రజ్యోతి): కురుపాం ఏకలవ్యలో కలకలం రేగింది. ఈ పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థినికి అబార్షన్‌ అయినట్లు ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలానికి చెందిన ఓ బాలిక వేసవి సెలవుల అనంతరం ఏకలవ్య పాఠశాలకు వెళ్లింది. కొద్ది రోజలు బాగానే ఉంది. అయితే గత నెల 26న కడుపునొప్పి రావడంతో పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన కురుపాం ‘ఏకలవ్య’కు చేరుకున్నారు. వెంటనే బాలికను పాఠశాల సిబ్బందితో కలిసి వారు పార్వతీపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి బాలికను నేరుగా విజయనగరం జిల్లాకేంద్రాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి.. విద్యార్థినికి అబార్షన్‌ అయిందని చెప్పారు. అయితే బాలిక గర్భం దాల్చిన విషయం ఎవరూ గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. దీనిపై కురుపాం ఎస్‌ఐ పి.నారాయణరావు కేసు నమోదు చేయగా.. డీఎస్పీ రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక దగ్గరి బంధువే ఈ పనిచేశాడని కుటుంబ సభ్యులు సందేహిస్తున్నారు. కురుపాం ఏకలవ్య పాఠశాల విద్యార్థిని సంఘటనపై ఏటీడబ్ల్యూవో ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నామని మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి తెలిపారు. ‘బాలికకు అబార్షన్‌ అయింది. ఏప్రిల్‌ నెలలో బాలిక సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఇదంతా జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో గుర్తించాం.’ అని చెప్పారు. కాగా గతంలోనూ కురుపాం ఏకలవ్యకు చెందిన ఓ ఇంటర్‌ బాలిక గర్భం దాల్చి.. ఏడు నెలలు వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా అటువంటి ఘటనే జరగడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

Updated Date - Jul 05 , 2026 | 12:12 AM