Share News

‘Upadhi’ నేడు జిల్లాలో ‘ఉపాధి’ గ్రామసభలు

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:58 PM

‘Upadhi’ Gram Sabhas Held Across the District Today వీబీ-జీ రామ్‌జీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం జిల్లాలోని 451 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

‘Upadhi’  నేడు జిల్లాలో ‘ఉపాధి’ గ్రామసభలు

పార్వతీపురం/గరుగుబిల్లి/సాలూరు రూరల్‌, జనవరి4(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రూపుమారుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. వేతనదారులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తూ.. వీబీ-జీ రామ్‌జీ చట్టాన్ని రూపొందించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం జిల్లాలోని 451 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో కార్యదర్శులు గ్రామసభలు నిర్వహిస్తారు. ప్రజలు, వేతనదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గ్రామసభలో ప్రధాన అంశాలను వివరిస్తారు. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక ప్రచార సామగ్రిని పంచాయతీలకు అందించారు. గ్రామ సభలో ఉపాధి నూతన చట్టం, పారిశుధ్యంపై చర్చించిన అనంతరం పలు అంశాలను విధిగా డాక్యుమెంట్‌ చేయాల్సి ఉంది. పంచాయతీ నిర్ణయ్‌ యాప్‌ లేదా ఈసీవీబీ-జీ రామ్‌జీ మొబైల్‌ యాప్‌లో పొందుపర్చాల్సి ఉంది. కాగా ప్రత్యేక గ్రామసభల నిర్వహణకు సంబంధించి క్షేత్ర సహాయకులకు పలు ఆదేశాలు జారీ చేశామని ఎంపీడీవో పి.పైడితల్లి, ఏపీవో ఈశ్వరమ్మ, ఇంజనీర్‌ డి.తేజేశ్వరరావు ఆదివారం విలేఖర్లకు తెలిపారు. నిబంధనల మేరకు గ్రామసభలు నిర్వహించి పూర్తిస్థాయి నివేదికలను ఉన్నతాధి కారులకు అందిస్తామన్నారు. జిల్లాలో 2లక్షల పది వేల జాబ్‌కార్డులున్నాయి. వాటిలో 3.88 లక్షల మంది వేతనదారులున్నారు. ప్రస్తుతం 1.93 లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌గా ఉండగా సుమారు 3.41 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులకొస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. కాగా ఈ పథకం కింద పనులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి చేపట్టనున్నారు.

శ్రమజీవులకు అదనపు ఆదాయం

మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రతి వేతనదారుడికీ 100 రోజుల పని దినాలు కల్పించేవారు. ప్రస్తుతం పని దినాలను 125 రోజులకు పెంచనున్నారు. దీంతో జిల్లాలోని శ్రమజీవులకు అదనపు ఆదాయం లభించనుంది. నిర్వహణ వ్యయం 6 నుంచి 9 శాతానికి పెరగనుంది. ఇప్పటి వరకూ కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వ్యయం భరిస్తూ వస్తున్నాయి. కానీ ఇక నుంచి కేంద్ర, 60, రాష్ట్రం 40 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం కారణంగా వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడుతోందని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఖరీఫ్‌లో 2 నెలల పాటు పనులకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆలస్యమైతే పరిహారం

ఎవరైనా అర్హులు పని కావాలంటే 14 రోజుల్లో అవకాశం కల్పించాలి. లేదంటే సహేతుకమైన కారణం ఉండాలి. అలా చేయకుంటే సంబంధిత సిబ్బంది జీతాల్లో కోత విధించి వేతనదారులకు చెల్లిస్తారు. వివిధ కారణాలతో వేతనదారులకు చెల్లింపులో ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా పెరగడంతో పర్యవేక్షణ ఆ స్థాయిలోనే ఉంటుంది. ‘ఎవరైనా పని కోరిన తర్వాత ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి దానంతట అదే వేతనదారుని ఖాతాలో జమవుతుంది. వేతనం చెల్లింపులో జాప్యం జరిగే కాలానికి సంబంధించి కూలీలకు పరిహారం చెల్లిస్తారు. ’ అని సాలూరు ఉపాధి పథకం ఏపీవో టి.రామకృష్ణ చెప్పారు.

పల్లె ప్రగతి..

గ్రామీణ ప్రాంతాల్లో జలసంరక్షణ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, జీవనోపాధుల కల్పన, ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనే పనులు చేపడతారు. ర కొత్తగా 266 పల్లెల ప్రగతి పనులు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం... పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణం ఈ నిధులతోనే చేపట్టనున్నారు. బంజరు, బీడు భూముల్లో పండ్ల తోటలు, మొక్కల పెంపకంతో పాటు పండ్ల తోటలు, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ఈ కొత్త పథకం ద్వారా నిధులు మంజూరుకానున్నాయి.

Updated Date - Jan 04 , 2026 | 11:58 PM