Until the interview.. ఇంటర్వ్యూ వరకూ వచ్చి..
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:36 PM
Until the interview.. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తుదారులు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. రుణం వస్తే వ్యాపారం చేసుకుందామని, స్వయంశక్తితో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంటర్వ్యూ వరకూ వచ్చి..
ఆగిన రుణాల మంజూరు ప్రక్రియ
ఏడాదిగా నిరుద్యోగుల నిరీక్షణ
జిల్లా వ్యాప్తంగా 19,616 మంది ఎదురుచూపులు
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి):
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తుదారులు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. రుణం వస్తే వ్యాపారం చేసుకుందామని, స్వయంశక్తితో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రుణ పథకాలూ అందకపోవడంతో వారంతా తీవ్ర నిరాశలో ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా బీసీ, మైనార్టీ, కాపు, వైశ్య , క్షత్రియ, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, మేధర, కుమ్మరి కులాలకు చెందిన యువతీ యువకులు రుణం కోసం దరఖాస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 19,616 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అక్కడితో ప్రక్రియ ఆగిపోయింది. కొంతమంది అభ్యర్థులు బ్యాంకు మేనేజర్లు నుంచి క్లియరెన్స్(విల్లింగ్) కూడా తీసుకున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఏడాది కావస్తున్నా ఇప్పటికీ రుణాల మంజూరులో స్పష్టత రాకపోవడంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రుణాలు మంజూరైతే ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు.
కులాల వారీగా వచ్చిన దరఖాస్తులిలా..
జిల్లాలోని బీసీ కులాలకు చెందిన వారిలో సెల్ఫ్ యూనిట్ల కోసం 17, 478 దరఖాస్తులు, జనరిక్ షాపులకు 50దరఖాస్తులు వచ్చాయి. మేదరి, కుమ్మరి కులాల నుంచి 146 దరఖాస్తులు, వైశ్య కులానికి చెందినవారు 901 మంది, జనరిక్ దుకాణాలకు రెండు దరఖాస్తులు వచ్చాయి. బ్రాహ్మణ కులస్తులు 53 మంది, క్షత్రియల నుంచి 50 దరఖాస్తులు, రెడ్డి కులం నుంచి 8 మంది, కాపు సామాజిక వర్గం నుంచి సెల్ప్ ఫైనాన్స్ యూనిట్ల కోసం 675 మంది, జనరిక్ షాపులకు 21 దరఖాస్తులు వచ్చాయి. ఈబీసీ నుంచి 43, కమ్మ సామాజిక వర్గం నుంచి 10 దరఖాస్తులు వచ్చాయి.
కేటాయించిన యూనిట్లు ఇవే
బీసీ కార్పోరేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని కులాల వారికి సెల్ఫ్ ఫైనాన్స్, జనరిక్ దుకాణాలకు కలిపి రూ.71.33 కోట్లతో 3,379 యూనిట్లు లక్ష్యంగా నిర్ధారించారు. బీసీ కులాల వారికి సెల్ఫ్ ఫైనాన్స్ 2883 యూనిట్లు, జనరిక్ షాపులకు 59, మేదరి వారికి 109 యూనిట్లు, కుమ్మరి వారికి 110 యూనిట్లు, ఈబీసీలో సెల్ఫ్ ఫైన్సాన్ కింద 37 యూనిట్లు, జనరిక్ కింద 6 యానిట్లు , వైశ్య సెల్ఫ్ ఫైనాన్స్ కింద 23 , జనరిక్ దుకాణాలకు 5, క్షత్రియ కులం నుంచి 16 యూనిట్లు, జనరిక్ 3, కమ్మ కులానికి 3, జనరిక్ 1, రెడ్డి సామాజిక వర్గానికి 2 రెండు యూనిట్లు కేటాయించారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది.
బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల పరిధిలో ఉన్నాయి. కొన్ని బ్యాంకుల లాగిన్‌లకూ పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తరువాత నిర్ణయం తీసుకుంటాం.
- గోపీ, ఈడీ, జిల్లా బీసీ కార్పొరేషన్
===========