Migration ఆగని వలసలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:40 PM
Unstoppable Migration స్థానికంగా ఉపాధి కరువై.. గిరిజనులు వలసబాట పడుతున్నారు. పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో పొట్ట చేతపట్టుకుని ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు తరలిపోతున్నారు. దీంతో గిరిజన గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కురుపాం మండలంలో బూర్జమానుగూడ, చీడిమానుగూడ, వలస బల్లేరు, పొడి, జొంగరపాడు తదితర ప్రాంతాల్లో వలసలు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
స్థానికంగా కరువైన ఉపాధి
వెలవెలబోతున్న గ్రామాలు
శ్రమ దోపిడీకి గురవుతున్న గిరిపుత్రులు
కురుపాం రూరల్, మార్చి21(ఆంధ్రజ్యోతి): స్థానికంగా ఉపాధి కరువై.. గిరిజనులు వలసబాట పడుతున్నారు. పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో పొట్ట చేతపట్టుకుని ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు తరలిపోతున్నారు. దీంతో గిరిజన గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కురుపాం మండలంలో బూర్జమానుగూడ, చీడిమానుగూడ, వలస బల్లేరు, పొడి, జొంగరపాడు తదితర ప్రాంతాల్లో వలసలు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. యేగులవాడ పంచాయతీ పరిధి రజ్జలి విషయానికొస్తే.. ఈ గిరిజన గ్రామంలో సుమారు 63 కుటుంబాలు ఉండగా.. గ్రామస్థులం దరిదీ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. వరి కోతలు పూర్తయిన తరువాత కొన్నిరోజులు వారికి జీడి తోటల్లో తుప్పలు కొట్టే పని దొరికింది. అవి పూర్తయిన తరువాత ఫిబ్రవరి 12న సుమారు 35 మంది పనుల కోసం కృష్ణా జిల్లా గుడివాడ వెళ్లారు. మినుప చేను తీసే పనులకు ఓ ఏజెంట్ వారిని కుదిర్చాడు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేస్తే రూ. 750 వచ్చేది. అయితే అందులో రూ.50 చొప్పున ఏజెంట్ వారి నుంచి కమీషన్ తీసుకునేవాడు. కాగా ఆ గ్రామ గిరిజనులు అక్కడ పది రోజుల పాటు పనిచేసిన తర్వాత అసలు సమస్య మొదలైంది. మినప చేను పక్వానికి రాలేదంటూ ఏజెంట్ 12 రోజుల కూలీ డబ్బులు చెల్లించలేదు. దీంతో చేసేదేమి లేక ఆ గ్రామస్థులు పది రోజులు పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోనే కాలం వెళ్లదీశారు. ఇదిలా ఉండగా కూలీల లభ్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో అయితే వారికి రోజు కూలిగా రూ. 600 మాత్రమే ఏజెంట్ ఇచ్చేవాడు. మొత్తంగా వలస వెళ్లిన గిరిజన కూలీలు ఇలా ఏజెంట్ చేతుల్లో మోసపోతున్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఇటీవల స్వగ్రామం రజ్జలి చేరుకున్న ఆ వలస కూలీలు మళ్లీ గుడివాడ వెళ్లేందుకు సమాయత్తమవు తున్నారు. కూలిగా ఎంత ముట్టినా పని చేసేందుకు వేరే జిల్లాకు వెళ్లడం తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. స్థానికంగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
స్థానికంగా పనుల్లేక ..
రజ్జలి గ్రామంలో 63 కుటుంబాలు ఉండగా.. 230 మంది ఉపాధి వేతనదారులు ఉన్నారు. దాదాపు అందరివీ వంద రోజుల పనిదినాలు పూర్తయ్యాయి. పని దినాలు లేకపోవడంతో చాలా మంది వలసబాట పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పనిదినాలు కల్పించి గిరిజనులకు ఉపాధి పనులు కల్పించాలి.
- ఆరిక తేజేశ్వరరావు, ఉపాధి వేతనదారుడు. రజ్జలి
===============================
ఉపాధి కల్పిస్తాం..
ఉపాధి హామీ పథకం వచ్చేనెల నుంచి కొత్త హంగులు దిద్దుకోనుంది. వీబీజీ రామ్‌జీ కొత్త పథకం అమలు కానుంది. అయితే దీనికి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. గ్రామ పంచాయతీలో 20 పనులు మాత్రమే చేసేందుకు వీలుంది. పని దినాలు పూర్తి కాని వారికి పనులు కల్పిస్తున్నాం. వీలుంటే రజ్జలి గ్రామస్థులకు తప్పకుండా ఉపాధి కల్పిస్తాం.
- డి.రమణమూర్తి, జేఈ, ఎన్‌ఆర్‌ఈజీఎస్, కురుపాం