Agency Area ఏజెన్సీలో కలవరం
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:51 PM
Unrest in the Agency Area సీతంపేట మన్యంలో గిరిజనులను కిడ్నీ వ్యాధి కలవరపెడుతోంది. ఇటీవల కాలంలో సీకేడీ(క్రానిక్ కిడ్ని డీసీజ్)కేసుల సంఖ్య పెరుగుతుండగా.. కొందరు మృత్యువాత పడ్డారు. మరికొందరు డయాలసిస్ స్టేజ్‌లో ఉన్నారు. ఇంకొందరు వైద్య సేవలు పొందుతున్నారు.
కిడ్నీ వ్యాధి నిర్ధారణ అయ్యేలోపే క్షీణిస్తున్న గిరిపుత్రుల ఆరోగ్యం
నివారణ చర్యలు శూన్యం
స్పందించాలని వేడుకోలు
సీతంపేట రూరల్, మార్చి28(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో గిరిజనులను కిడ్నీ వ్యాధి కలవరపెడుతోంది. ఇటీవల కాలంలో సీకేడీ(క్రానిక్ కిడ్ని డీసీజ్)కేసుల సంఖ్య పెరుగుతుండగా.. కొందరు మృత్యువాత పడ్డారు. మరికొందరు డయాలసిస్ స్టేజ్‌లో ఉన్నారు. ఇంకొందరు వైద్య సేవలు పొందుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని కొత్తూరు, భామిని, హిరమండలం, పాతపట్నం మండలాల నుంచి కూడా కిడ్నీ బాధితులు సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. ఈఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మొత్తంగా 12 కిడ్నీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కొందరు డయాలసిస్ స్టేజ్‌లో ఉన్నారు. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఇటీవల ప్రారం భించిన డయాలసిస్ కేంద్రంలో రోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఒక షిఫ్ట్‌లో ఐదుగురికి డయాలసిస్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
సీతంపేట మన్యంలో దోనుబాయి, మర్రిపాడు, కుసిమి పీహెచ్‌సీ పరిధిలో మొగదార, ఉప్పరజమ్మి, పెద్దగూడ, కాకరగూడ, అడ్డాకులగూడ, దిగువదారబ, కోడిపిల్లలగూడ తదితర గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ప్రతి గిరిజన గ్రామంలో ఇద్దరు లేక ముగ్గురు చొప్పున గిరిజనులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కాగా వారిలో కొందరు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొందరిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రిఫెర్ చేశారు. ఇటీవల కాలంలో చికిత్స పొందుతూ ఓ గిరిజన మహిళ మృతిచెందింది. రెండు రోజుల కిందట మరొక వ్యక్తి మృతిచెందారు.
అవగాహన లోపం
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల్లో నిరక్షరాస్యులే ఎక్కువ. అయితే చిన్నపాటి జ్వరం, ఒంటినొప్పులు, ఇతరాత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఆర్‌ఎంపీలు, సంచి వైద్యులు, మూలికా వైద్యులను ఆశ్రయించడం వారికి అలవాటుగా మారింది. దీనినే ఆసరాగా చేసుకుంటున్న సంచివైద్యులు వచ్చిరాని వైద్యాన్ని గిరిజనులకు చేసి కాసులు దండుకుంటున్నారు. అంతేకాకుండా హై యాంటీబయాటిక్ మాత్రలు, పెయిన్‌కిల్లర్ ఇంజక్షన్‌లు వంటి మందులను గిరిజన రోగులతో వాడిస్తున్నారు. వాటి కారణంగా ఉన్న జబ్బుల మాట అటు ఉంచితే కాలక్రమంలో గిరిపుత్రుల కిడ్నీలపై ఆ ప్రభావం పడుతోంది. మరికొందరు గిరిజనులు లేనిపోని మూఢనమ్మకాలతో మూలికా వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈవిధంగా గిరిపుత్రులు కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురై అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అయితే ఆయా అంశాలపై అవగాహన కల్పించాల్సిన వైద్యశాఖ స్పందించడం లేదని గిరిజనసంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్యశిబిరాల ద్వారా గిరిపుత్రులకు అవగాహన కల్పించాలని వారు కోరుతున్నాయి.
డిప్యూటీ డిఎంహెచ్‌వో ఏమన్నారంటే..
‘సీతంపేట ఏజెన్సీలోని మూడు పీహెచ్‌సీల్లో కిడ్నీ కేసులు నమోదు కాలేదు. గతంలో సీతంపేట, భామిని మండలాల్లోని అడ్డాకులగూడ, నల్లరాయిగూడ గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారని గుర్తించి వైద్యశిబిరాలు ఏర్పాటు నిర్వహించాం. తాగునీటి నమూనాలు కూడా సేకరించాం. ’ అని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో బి.విజయపార్వతి తెలిపారు.