Share News

Unpaid sanitation workers స్వచ్ఛతలో కీలకం.. వేతనం అందక దైన్యం

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:19 AM

Unpaid sanitation workers టీడీపీ నాయకుల నుంచి డబ్బులు తీసుకుంటున్న ఆ వ్యక్తి శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు.

Unpaid sanitation workers  స్వచ్ఛతలో కీలకం.. వేతనం అందక దైన్యం
శృంగవరపుకోట పంచాయతీ కార్యాలయంలో సంక్రాంతి పండగ ఖర్చులకు పారిశుధ్య కార్మికుడికి అప్పుగా డబ్బులు అందిస్తున్న టీడీపీ నాయకులు (ఫైల్‌)

స్వచ్ఛతలో కీలకం.. వేతనం అందక దైన్యం

జీతాలకు నోచుకోని పారిశుధ్య కార్మికులు

చెల్లించలేకపోతున్న మేజర్‌ పంచాయతీలు

రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు బకాయిలు

010 పద్దు అమలు కోసం ఫలించని ఎదురుచూపులు

- టీడీపీ నాయకుల నుంచి డబ్బులు తీసుకుంటున్న ఆ వ్యక్తి శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు. ఇతనికి ఆరు నెలలుగా జీతం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పారిశుధ్య కార్మికుల కుటుంబాలు సంక్రాంతి పండగ చేసుకొనేందుకు అందరికీ తలా రూ.పది వేలు చొప్పున సర్దుబాటు చేయాలని పంచాయతీ పరిధిలోని నాయకలు పెదగాడ రాజు, చెక్కా కిరణ్‌ కుమార్‌, కాపుగంటి శ్రీనివాసరావు, అనకాపల్లి చెల్లియ్యలకు సూచించారు. ఈనెల 13న సాయంత్రం వీరంతా పంచాయతీ మేస్త్రీ కృష్ణ సమక్షంలో ఈ సొమ్మును అప్పుగా అందించారు.

శృంగవరపుకోట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):

మేజర్‌ పంచాయతీల్లోని పారిశుధ్య కార్మికులు జీతాలకు నోచక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా పండగ సమయంలో కూడా అప్పులపై ఆధారపడుతున్నారు. ఎస్‌.కోట పంచాయతీ ఆరు నెలల జీతాలకు గాను సంక్రాంతికి రెండు నెలల జీతాలు చెల్లించేందుకు బిల్లులు పెట్టింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఈ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఈ పండగకు కూడా అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేజర్‌ పంచాయతీ పరిధిలో 12 మంది శాశ్వత పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.6.50 లక్షలు, కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న 36 మంది పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.7.80 లక్షలు జీతాన్ని పంచాయతీ అందిస్తుంది. వీరు కాక క్లాప్‌ మిత్రలకు నెలకు రూ.96వేల వరకు జీతాలు అందిస్తున్నారు. ఇలా నెలకు మొత్తం రూ. 15.26 లక్షల చొప్పున ఏడాదికి రూ.1.83 కోట్లు పంచాయతీ ఆదాయం నుంచి వీరి జీతాలకు పోతుంది. ఇందుకు అనుగుణంగా పంచాయతీకి ఆదాయం లేదు. దీంతో రెండు నెలల జీతాలు చెల్లించడం ఆనవాయితీగా మారింది. నాలుగు నెలల బకాయిలు ఎప్పుడూ వెనక్కి ఉంటూనే ఉన్నాయి.

- కొత్తవలస మేజర్‌ పంచాయతీ పరిధిలో 69 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. మూడు నుంచి ఐదు నెలల బకాయిలు ఉంటున్నాయి. చీపురపల్లి మేజర్‌ పంచాయతీలో 52 మంది పారిశుధ్య కార్మికులకు రెండు నెలల బకాయిలు ఉన్నాయి. గరివిడి, జామి వంటి మేజర్‌ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. ఏ నెలకు ఆ నెల జీతాలు అందక పారిశుధ్య కార్మిక కుటుంబాలు సాధారణ రోజుల్లోనే కాదు పండగ సమయంలోనూ ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు.

ప్రజారోగ్యమే లక్ష్యంగా..

పల్లె ప్రజలు నిద్ర లేవకముందే వానైనా, చలైనా వీధుల్లో కనిపిస్తారు. చెత్తా, చెదారం ఏరివేతతో పాటు మురుగు కాలువలను శుభ్రం చేస్తారు. ప్రజారోగ్యానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. వీరు ఒక్క రోజు పనికి రాకపోతే వీధులు చెత్తా చెదారంతో నిండిపోతాయి. మురుగు కాలువలు కంపుకొడతాయి. ప్రజారోగ్యం కాపాడుతున్న కార్మికులకు సకాలంలో జీతాలు అందకపోతే ఎవరికీ పట్టడం లేదు.

ఫలించని ఎదరుచూపులు

పంచాయతీ పారిశుధ్య కార్మికులు చాలా ఏళ్లుగా 010 పద్దు అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం దీన్ని అమలు చేయకపోవడంతో వీరి ఆశలు ఫలించడం లేదు. పంచాయతీల్లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన శాశ్వత ఉద్యోగులకు ప్రభుత్వం 010 పద్దు కింద జీతాలను చెల్లిస్తోంది. పంచాయతీల్లో శాశ్వత ప్రాతిపాదికన పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మాత్రం ఈ పద్దు అమల్లో లేదు. దీన్ని అమలు చేయాలని చాలా ఏళ్లుగా కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

- కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చింది. పది వేల జనాభాపైబడి ఉన్న మేజర్‌ పంచాయతీలన్నింటినీ రూర్బన్‌ పంచాయతీలుగా మార్చింది. రూరల్‌కు అర్బన్‌కు (గ్రామాలకు ఎక్కువ, పట్టణాలకు తక్కువ)మధ్యస్థంగా ఉండడంతో వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. రూర్బన్‌ పాలన పట్టాలెక్కిన తరువాతైన పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు అందుతాయేమో చూడాలి.

Updated Date - Jan 19 , 2026 | 12:19 AM