CM Chandrababu: గతానికి భిన్నంగా..
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:52 PM
CM Chandrababu:సీఎం చంద్రబాబునాయుడి జిల్లా పర్యటన గతానికి భిన్నంగా సాగింది. శనివారం నాలుగు గంటలు ఆయన జిల్లాలో ఉన్నారు.
- వ్యాక్సినేషన్ ప్రారంభం.. విద్యార్థులతో ముచ్చట్లు
- వైద్యులు, వైద్యసిబ్బందితో ఫొటోలు
- సభలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..
- అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపిస్తూ
- బంగారు కుటుంబాలకు భరోసానిస్తూ..
- జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- గతంలో జగన్ వస్తే అధికారులకు చుక్కలే
- జనాన్ని తరలించేందుకు నానా పాట్లు
- పొరుగు జిల్లాల నుంచీ ఆర్టీసీ బస్సులు
- చంద్రబాబు వచ్చాక ఆ పరిస్థితి లేదు
- ఊపిరిపీల్చుకున్న అధికార యంత్రాంగం
సీఎం చంద్రబాబునాయుడి జిల్లా పర్యటన గతానికి భిన్నంగా సాగింది. శనివారం నాలుగు గంటలు ఆయన జిల్లాలో ఉన్నారు. ఎక్కడా హడావుడి కనిపించలేదు. రోడ్ల దిగ్బంధాలు లేవు. ట్రాఫిక్ మళ్లించడాలు లేవు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు రావివలస రాగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకుంటూ.. భరోసానిచ్చారు. అక్కడే ఉన్న వైద్యులు, సిబ్బందితో ఫొటోలు దిగారు. సభలో కూడా ప్రజల నుంచి వచ్చిన వినతులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులను వేదికపైకి ఆహ్వానించి వారితో ముచ్చటించారు. బంగారు కుటుంబాలతో మాట్లాడారు. అనాథలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు మూడేసి లక్షల రూపాలయ చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
విజయనగరం/చీపురుపల్లి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా చంద్రబాబు శనివారం చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పర్యటన జిల్లా ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. గత వైసీపీ పాలనలో అప్పటి సీఎం జగన్ జిల్లాకు వచ్చేటప్పుడు రహదారుల దిగ్బంధం జరిగేది. పరిసరాలన్నీ పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయేవి. ట్రాఫిక్‌ను వేరే రూట్లలో మళ్లించేవారు. పట్టణాలు, గ్రామాలను తమ అదుపులోకి తెచ్చుకునేవారు. ప్రజలు రవాణా కష్టాలు పడేవారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మళ్లించేవారు. ప్రైవేటు పాఠశాలలకు అప్రకటితంగా సెలవులూ అమలయ్యేవి. ఆ స్కూళ్ల బస్సులను వినియోగించుకునేవారు. జగన్ వస్తున్న రూట్లో పరదాలు కట్టే బాధ్యతను ఆర్‌అండ్‌బీకి అప్పగించే వారు. అడ్డంగా ఉందని చెట్లను సైతం నరికివేసేవారు. రోడ్డు డివైడర్లను ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి. హెలిప్యాడ్ నుంచి సభ వరకూ ఫ్లెక్సీలతో నింపేసేవారు. జగన్ సభల్లో గలాటా జరగకుండా ఉపాధ్యాయ సంఘాల నేతలను నియమించిన సందర్భాలున్నాయి. ముందురోజే ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకునేవారు. అన్నింటికీ మించి వైసీపీ శ్రేణులు అంతులేని అతి చేసేవారు. కానీ, శనివారం జరిగిన సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో మచ్చుకైనా ఇలాంటి ఘటనలు కనిపించలేదు. ఆర్భాటం లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ప్రజల సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ సాగింది. శనివారం ఉదయం 11-45 గంటలకు రావివలస వచ్చిన సీఎం.. సాయంత్రం 4.45 గంటలకు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.
విద్యార్థినులతో ముచ్చట్లు
రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. సీఎం సమక్షంలో 14 ఏళ్ల లోపు విద్యార్థినులకు ఏఎన్‌ఎంలు వ్యాక్సిన్లు వేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో విద్యార్థినులతో ఆయన ముచ్చటించారు. వ్యాక్సిన్ ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. గర్భకోశ క్యాన్స్‌ర్ రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ కార్డుల్లో వ్యాక్సినేషన్ డేటా పొందుపర్చాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని అదేశించారు. ప్రయివేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి సలహా సంఘ కమిటీల నియామకం చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రుల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. సీఎంకు స్వాగతం పలికిన వారిలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, పూసపాటి అదితిగజపతిరాజు, కోళ్ల లలితకుమారి, లోకం నాగమాధవి, నడుకుదుటి ఈశ్వరరావు, డీసీసీబీ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, కిమిడి రామ్‌మల్లిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.