Universities here... celebrations there. వర్సిటీలు ఇక్కడ.. ఉత్సవాలు అక్కడ
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:16 AM
Universities here... celebrations there.విద్యానగరంగా పేరొందిన విజయనగరం చిన్నబోయే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు నొచ్చుకునే పరిస్థితులు వస్తున్నాయి.
వర్సిటీలు ఇక్కడ.. ఉత్సవాలు అక్కడ
మొన్న గిరిజన వర్సిటీ, నేడు జేఎన్‌టీయు జీవీ
ఎందుకిలా అంటున్న జిల్లా విద్యావేత్తలు
స్థానికంగా నిర్వహిస్తే జిల్లాకూ పేరుప్రఖ్యాతలు
భద్రత కారణాలంటున్న వర్సిటీ అధికారులు
విద్యానగరంగా పేరొందిన విజయనగరం చిన్నబోయే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు నొచ్చుకునే పరిస్థితులు వస్తున్నాయి. విజయనగరం గొప్పతనం దేశదేశాల్లో చెప్పుకుంటుండగా ఇక్కడేంటి ఇలా అని ఆశ్చర్యపోతున్నారు. మొన్న జరిగిన గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం, శనివారం జరగనున్న జేఎన్‌టీయూ జీవీ స్నాతకోత్సవాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. ఈ రెండు ఇక్కడ కాకుండా విశాఖలో నిర్వహిస్తుండడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఇక్కడ పుట్టి పెరిగి అంతర్జాతీయంగా పేరు గడించిన వ్యక్తులున్నారు. ఇక్కడ ఉద్భవించిన కళలకు ఖండాలను దాటిన ఖ్యాతి ఉంది. అయినా ఎందుకిలా అని జిల్లా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
విజయనగరం రూరల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, జెఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయం వైభవంగా నడుస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వచ్చి వీటిల్లో చదువుతున్నారు. ఈ రెండు వర్సిటీలు ఉన్నందుకు జిల్లా ప్రజలు కూడా గర్విస్తున్నారు. వివిధ సందర్భాల్లో వేదికలపై జిల్లా నేతలు, అధికారులు ఈ రెండు వర్సిటీల పేర్లను ప్రస్తావిస్తున్నారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలని భావిస్తున్న వేళ వర్సిటీల స్నాతకోత్సవాలను వేరొక జిల్లాలో నిర్వహిస్తుండడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. మౌలిక సదుపాయల పరంగా కూడా విజయనగరం మునుపటి కంటే మెరుగ్గా ఉంది. అటువంటి స్థితిలో జిల్లాకు చెందిన రెండు వర్సిటీల తొలి స్నాతకోత్సవాలు పొరుగున వున్న విశాఖపట్నంలో నిర్వహిస్తుండడం తెలిసి జిల్లాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ నొచ్చుకుంటున్నారు.
గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం గత నెల 30న విశాఖపట్నం వేదికగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన విశ్వవిద్యాలయం ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కొనసాగడం, సౌకర్యాలు అంతంతమాత్రంగా వుండడంతో వీవీఐపీలు వచ్చిన ఆ స్నాతకోత్సవాన్ని విశాఖలో నిర్వహించినట్టు వర్సిటీ అధికారులు చెప్పుకొచ్చారు. అంత పెద్ద వేడుక ఇక్కడ జరిగితే వారంతా జిల్లాకు వచ్చేవారని, జిల్లా పేరును అందరూ ప్రస్తావించి ఉండేవారని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ నెల 11న జరగనున్న జెఎన్‌టీయు జీవీ స్నాతకోత్సవం అయినా విజయనగరంలో చేస్తారేమోనని? ఆ యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, యూనివర్సిటీ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆశించారు. విజయనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఈ స్నాతకోత్సవాన్ని ఇక్కడ కాకుండా విశాఖలో చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫ జెఎన్‌టీయూ జీవీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్నాతకోత్సవం ఇక్కడ నిర్వహించాలని ఈ మేరకు ప్రత్యేక హాలును కూడా సిద్ధం చేశారు. వీవీఐపీలు వచ్చినా, 500 మందితో సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఈ హాల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతా ఓకే అనుకున్న సమయంలో సెక్యూరిటీ షాకుగా చూపి స్నాతకోత్సవాన్ని విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసేశారు. ఇదే విషయాన్ని జెఎన్ టీయు వీసీ వీవీ సుబ్బారావు వద్ద ప్రస్తావించగా, పైనుంచి వచ్చిన ఆదేశాలను తాము పాటిస్తున్నామని తెలిపారు. ఏటా క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వచ్చే ఏడాది స్నాతకోత్సవం ఇక్కడ జరిగే అవకాశం ఉందని అన్నారు.
స్నాతకోత్సవానికి ఏర్పాట్లు
34,896 మందికి అందజేయనున్న పట్టాలు
11 మందికి పీహెచ్‌డీ
ముఖ్య అతిథిగా గవర్నర్ నజీర్
విజయనగరం రూరల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం జేఎన్‌టీయు జీవీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమైంది. విశాఖ బీచ్‌రోడ్డులోని ఆంధ్రాయూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో శనివారం ఈ వేడుక జరుగనుంది. ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్ధుల్ నజీర్ హాజరుకానున్నారు. 34,896 మందికి పట్టాలు ప్రదానం చేయాలని, 11 మందికి పీహెచ్‌డీ అవార్డు ఇవ్వాలని వర్సిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా 2019- 2023, 2021- 2025 బ్యాచ్‌లకు చెందిన 34,896 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తామని వీసీ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు తెలిపారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్ధుల్ నజీర్ హాజరవుతున్నారని చెప్పారు. పోస్టు గ్రాడ్యూట్ చదివిన 2,708 మందితో పాటు 11 మందికి పీహెచ్‌డీ అవార్డులు ఇస్తామని, 50 మందికి బంగారు పతకాలు ఇవ్వనున్నామన్నారు. జెఎన్‌టీయు జీవీ క్రమేణా అభివృద్ధి చెందుతోందని, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. వర్సిటీ ఆరు జిల్లాల్లో విస్తరించి ఉందని, విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం యూనివర్సిటీకి తరచూ రాకుండా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించామన్నారు. రానున్న రెండేళ్లల్లో యూనివర్సిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మీ ఉన్నారు.