Union Minister surprise అబ్బురపడిన కేంద్రమంత్రి
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:20 AM
Union Minister surprise భోగాపురం పీఎంశ్రీ ఏపీ మోడల్‌స్కూల్‌ను మంగళవారం సందర్శించిన కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అక్కడి విధానాలు, పరిసరాలు, బోధనా పరికరాలు, ఉత్తీర్ణత, వసతులు, ఏపీ ప్రభుత్వ చొరవను స్వయంగా తెలుసుకుని అబ్బురపడ్డారు.
అబ్బురపడిన కేంద్రమంత్రి
పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన ధర్మేంద్ర ప్రదాన్
విద్యారంగ అభివృద్ధిని వివరించిన మంత్రి నారా లోకేష్
అభినందించిన కేంద్ర మంత్రి
విజయనగరం /భోగాపురం జూన్30(ఆంధ్రజ్యోతి): భోగాపురం పీఎంశ్రీ ఏపీ మోడల్‌స్కూల్‌ను మంగళవారం సందర్శించిన కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అక్కడి విధానాలు, పరిసరాలు, బోధనా పరికరాలు, ఉత్తీర్ణత, వసతులు, ఏపీ ప్రభుత్వ చొరవను స్వయంగా తెలుసుకుని అబ్బురపడ్డారు. ఆయనకు ప్రతి అంశాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వివరించారు. ముందుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు విద్యార్థులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అలాగె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆధునిక పద్ధతిలో విద్యాబోధన, మౌలిక వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. జాదు పిఠారా కిట్ గురించి సిబ్బందితో కలిసి మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న విద్యార్థి పొగ్రెస్ కార్డ్, అసెస్ మెంట్ బుక్‌లెట్‌ను కేంద్ర మంత్రికి లోకేష్ చూపించి వివరించారు. విలువలతో కూడిన విద్య కోసం ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాల గురించి మంత్రి లోకేష్ వివరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్స్, యూనిఫాం, స్కూల్ బేగ్, షూ, టై, బెల్టు, సాక్స్‌లను కేంద్ర మంత్రి పరిశీలించారు. అలాగె విద్యాశాఖ రూపొందించిన డ్యాష్ బోర్డును కేంద్ర మంత్రి ఆసక్తిగా తిలకించారు. అందులో పొందుపరిచిన ఎన్‌రోల్‌మెంట్, లెర్నింగ్ అవుట్ కమ్ హాజరు, ఎండీఎం పథకం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, బడిమధ్యలో మానేసినవారి వివరాలు, స్మార్ట్ కిచెన్, భవిత కేంద్రాలు, అకడమిక్ తదితర అంశాల గురించి ఉపాధ్యాయులు విశదీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న స్మార్టు కిచెన్లపై రూపొందించిన ఏవీని వీక్షించారు. కడపలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్మార్టు కిచెన్ గురించి కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. అలాగే స్మార్టు గది, స్కిల్ ల్యాబ్‌లను వారు పరిశీలించారు. పైథాన్ లాంగ్వేజ్‌ను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్కు, పీరియాడికల్ అసెస్‌మెంట్, అప్లికేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం గురించి సిబ్బంది మంత్రులకు వివరించారు. అలాగే స్కూల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. 9వ తరగతి క్లాస్‌లో విద్యార్థులతో కలిసి క్లిక్కర్ (పాఠ్యాంశాల వీడియోలు) వీడియోను వీక్షించారు. విద్యార్థులకు క్విజ్ నిర్వహించి వారి సామర్థ్యం తెలుసుకొన్నారు. టిఫెన్, మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. చాణుక్య అంటే ఎవరో తెలుసా అని కేంద్ర మంత్రి ఓ విద్యార్థిని ప్రశ్నించారు. అలాగే ఏభాష సౌకర్యంగా ఉంటుందని ప్రశ్నించగా తెలుగు భాష అని ఆ విద్యార్థి సమాధానం ఇచ్చాడు. అనంతరం భోజన తయారీ స్థలానికి మంతుల్రు వెళ్లి రుచి చూసి రసం వగరుగా ఉందని అన్నారు. ఏపీలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్‌ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందించారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు వెనుతిరిగారు. వీరు ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల వరకు స్కూల్‌ను సందర్శించారు.