Unified Family Survey is key యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకం
ABN , Publish Date - May 02 , 2026 | 11:52 PM
Unified Family Survey is key ఏకీకృత కుటుంబ సర్వే (యూనిపైడ్ ఫ్యామిలీ సర్వే) సమగ్రంగా నిర్వహించాలని, ఖచ్చితమైన సమాచారం సేకరించాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదేశించారు.
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకం
కచ్చితమైన సమాచారం సేకరించాలి
బీసీ వర్గాల రిజర్వేషన్‌కు అదే ఆధారం
బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
విజయనగరం కలెక్టరేట్, మే 2(ఆంధ్రజ్యోతి):
ఏకీకృత కుటుంబ సర్వే (యూనిపైడ్ ఫ్యామిలీ సర్వే) సమగ్రంగా నిర్వహించాలని, ఖచ్చితమైన సమాచారం సేకరించాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదేశించారు. ఈ సర్వేతో వచ్చే సమాచారం వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ అమలుకు ఎంతో కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌పై అధ్యయం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నియమించిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ జిల్లాలో శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన కలెక్టరు రామసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పరిషత్, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీ అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ సెన్సెస్ ప్రక్రియలో బీసీ కులాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పరిశీలించుకోవాలని సూచించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులద్వారా జరిగే సర్వే ప్రక్రియను పూర్తిగా పరిఽశీలిస్తూ సంబంధిత సమాచారాన్ని పంచాయతీరాజ్, మున్సిపల్, కార్పొరేషన్ విభాగాలు సరిచూసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లు... మొత్తం సీట్లలో వారి ప్రాతినిధ్యం... నిష్పత్తి తదితర వివరాలు సేకరించి కమిషన్‌కు అందజేయాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న కుటుంబ సర్వే, సమాచార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని బాధ్యులుగా నియమించి పర్యవేక్షిస్తున్నామన్నారు. సర్వేకు అవసరమైన ఖచ్చితమైన సమాచారం సేకరిస్తున్నామన్నారు. జిల్లాపరిషత్, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల వారీగా సీట్ల సంఖ్య, గత ఎన్నికలలో బీసీ వర్గాల ప్రాతినిధ్యం, సీట్ల వివరాలు అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన్ సెక్రటరీ చంద్రశేఖర్ రాజు, ఏఎస్‌పి సౌమ్యలత, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి, సీపీవో బాలాజీ, డీపీవో మల్లిఖార్జున, బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతి శ్రీ పాల్గొన్నారు.
బీసీ కులాలపై ఆరా
భోగాపురం, మే2(ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని బీసీ డెడికేటెట్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా శనివారం సందర్శించి బీసీ కులాలపై ఆరా తీశారు. మండలంలో ఎంత మంది బీసీలు ఉన్నారు, ఏఏ సబ్ కులాలు ఉన్నాయి, బీసీలకు భూములు, ఆస్తులు ఉన్నాయా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఏవిధంగా అమలవుతున్నాయి, గ్రామ స్థాయిలో అమలవుతున్న విధానాలు, ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు, స్వర్ణగ్రామ సిబ్బందితో చర్చించి అడిగి తెలుసుకొన్నారు. అలాగే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఏవిధంగా జరుగుతోందని ప్రశ్నించారు. అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా భోగాపురం పంచాయతీలోని బీసీల గృహాల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.