అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:58 PM
అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నాడు.
కొత్తవలస, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కొత్తవలస సీఐ షణ్ముఖరావు సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామలింగపురం గ్రామానికి చెందిన సీముసురు నర్సునాయుడు(38) వివిధ రకాల వ్యాపారాలు చేసి, నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయాడు. తనకు ఉన్న వ్యవసాయ భూమిని కొంతవరకు విక్రయించి అప్పులు తీర్చినప్పటికీ ఇంకా అప్పులు ఉన్నాయి. ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ రామలింగపురం గ్రామం నుంచి కూలీలను విశాఖపట్టణం తీసుకెళ్లి సాయంత్రం తీసుకొస్తుంటాడు. ఆదివారం ఉదయం కూలీలను తీసుకెళ్లి విశాఖలో దించి సాయంత్రం మళ్లీ తీసుకు రావడానికి వెళ్లాల్సి ఉండగా వెళ్లలేదు. దీంతో కూలీలు ఆయన సెల్‌ఫోన్‌కు పలుమార్లు ఫోన్ చేశారు. ఎత్తకపోవడంతో రామలింగపురంలోనున్న నర్సునాయుడు మేనల్లుడు మువ్వల మహేష్‌కు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. మహేష్.. జీపీఎస్ సిస్టం ద్వారా ఆటో జాడను చూడగా కొత్తవలస పంచాయతీ, అడ్డూరువానిపాలెం సమీపంలోనున్న గోదావరి లేఅవుట్‌లోని మామిడితోటలో చూపించింది. దీంతో గ్రామానికి చెందిన యువకులు ఆదివారం రాత్రి వెతకగా.. తోటల్లోని ముళ్ల పొదల్లో ఉన్న మామిడి చెట్టుకు నర్సునాయుడు ఉరేసుకుని ఉండడాన్ని గుర్తించారు. ముందుగా 100కు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. అప్పటికే నర్సునాయుడు మృతి చెందినట్టు గుర్తించారు. మృతునికి వెంకటలక్ష్మి అనే భార్యతో పాటు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శృంగవరపుకోట సీహెచ్‌సీకి తరలించారు.