Unable to accept the facts.. వాస్తవాలు తట్టుకోలేకే..
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:32 AM
Unable to accept the facts.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, సంస్థ కార్యాలయాలపై దాడి యత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించారు. వాస్తవాలను వెలికితీస్తూ, నిజాలను నిర్భయంగా రాసే ఆంధ్రజ్యోతిపై దాడికి దిగడం గర్హనీయమని పేర్కొన్నారు.
పత్రికా స్వేచ్ఛకు భంగం
ఏబీఎన్- ఆంధ్రజ్యోతిపై దాడి యత్నాలను తీవ్రంగా ఖండించిన ఉమ్మడి జిల్లా వాసులు
పార్వతీపురం, ఏప్రిల్8(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, సంస్థ కార్యాలయాలపై దాడి యత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించారు. వాస్తవాలను వెలికితీస్తూ, నిజాలను నిర్భయంగా రాసే ఆంధ్రజ్యోతిపై దాడికి దిగడం గర్హనీయమని పేర్కొన్నారు. మీడియా సంస్థను నడుపుతున్న జగన్ సాటి మీడియా సంస్థపై దాడులను ప్రోత్సహించడం అత్యంత దురదృష్టకరంగా ప్రతి ఒక్కరూ అభివర్ణించారు. కాగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట వైసీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేయడం దారుణమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘వైసీపీ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడికి యత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవు. ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ వాస్తవాలు మాట్లాడితే.. మాజీ ముఖ్యమంత్రి జగన్ తట్టుకోలేక పోతున్నారు. ఏదేమైనా వైసీపీ బెదిరింపులకు ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ భయపడే పరిస్థితి ఉండదు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై దాడి యత్నం అప్రజాస్వామికం. ’ అని తెలిపారు.
దాడి యత్నం సరికాదు: పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవు. దాడులకు తెగబడడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పినా.. వైసీపీ తీరు మారలేదు. ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ వాస్తవాలు మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో సహా వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయడం తగదు. ’ అని తెలిపారు.