un wanted tree cutting గుట్టుగా తరలించడమే ‘ట్రీ’క్కు
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:15 AM
un wanted tree cutting పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఉండే ఖాళీ ప్రదేశాలు, కళాశాలలు, పాటశాలల మైదానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నదులు, చెరువుల గట్లుపై పెరిగే చెట్లంటే కొంతమందికి చాలా అలుసు. వాటిని నరికేసి పట్టుకుపోవడం సులువైన పనిగా భావిస్తారు. ఆయా ప్రాంతాల్లో మోతబరులు, లేదంటే వారి కనుసన్నల్లో మెలిగే వ్యక్తులు ఈ పనులకు సిద్ధపడుతున్నారు. స్థానికులు గుర్తించే సమయంలో కాకుండా రాత్రి వేళ అధికంగా చెట్లు కొడుతున్నారు.
గుట్టుగా తరలించడమే ‘ట్రీ’క్కు
అక్రమంగా కలప రవాణా
రాత్రి వేళ ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత
ఆనవాళ్లు లేకుండా దోపిడీ
నీలగిరి, సరుగుడుపైనే కన్ను
కనీస నిబంధనలు పాటించని వైనం
పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఉండే ఖాళీ ప్రదేశాలు, కళాశాలలు, పాటశాలల మైదానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నదులు, చెరువుల గట్లుపై పెరిగే చెట్లంటే కొంతమందికి చాలా అలుసు. వాటిని నరికేసి పట్టుకుపోవడం సులువైన పనిగా భావిస్తారు. ఆయా ప్రాంతాల్లో మోతబరులు, లేదంటే వారి కనుసన్నల్లో మెలిగే వ్యక్తులు ఈ పనులకు సిద్ధపడుతున్నారు. స్థానికులు గుర్తించే సమయంలో కాకుండా రాత్రి వేళ అధికంగా చెట్లు కొడుతున్నారు. లేదంటే ఉదయం 8 గంటల లోపు తమ పని కానిచ్చేస్తున్నారు. సముద్రానికి దగ్గరగా పెరిగే సరుగుడు చెట్లను కూడా అక్రమంగా తీసుకుపోవడం జిల్లాలో చాలా సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారమే.
రాజాం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కలప వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఇందులో అక్రమంగా జరుగుతున్న తంతే అధికం. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్లా కలప అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. బహిరంగ మార్కెట్‌లో కలపకు ఎప్పుడూ డిమాండే. గృహోపకరణాలకు కలపను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో పేపరు ఇండస్ట్రీ, ఇతర పరిశ్రమలకు కొన్ని రకాల మొక్కలు అవసరం. దీనిని గుర్తించే అక్రమార్కుల కన్ను కలపపై పడుతోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో చెట్లను రాత్రికి రాత్రి మాయం చేస్తున్నారు. ఏపుగా పెరిగిన భారీ వృక్షాలనే టార్గెట్ చేస్తున్నారు. అధునాతన యంత్రాలను వినియోగిస్తూ కొద్ది సమయంలోనే అధికంగా నరికేసి తెల్లవారేసరికి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. కోట్లలో వ్యాపారాలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటవీశాఖ అధికారులు మాత్రం నిఘా పెడుతున్నామని చెబుతున్నారు. కానీ గ్రామీణ, అటవీ ప్రాంతాల నుంచి నిత్యం కలప మాయమవుతూనే ఉంది.
రాజాం నియోజకవర్గంలో..
రాజాం నియోజకవర్గంలో కలప అక్రమ రవాణా అధికం. ముఖ్యంగా టేకు, చందన కర్రలను ఎక్కువగా తరలిస్తున్నారు. కలప కోత యంత్రాలు, టింబర్ డిపోలు కూడా ఎక్కువగానే నడుస్తున్నాయి. వీటిపై అధికారుల నిఘా కొరవడింది. ఇటీవల కాలంలో రైస్‌మిల్లులను మూసేసి ఆ స్థలంలో టింబర్ డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో సంబంధిత నిర్వాహకులు రాజకీయ నేతలతో కలివిడిగా ఉంటూ తమ పనికి ఎవరూ అడ్డురాకుండా జాగ్రత్త పడుతున్నారు. టింబర్ డిపోలకు వస్తున్న కలపలో కొంతవరకే సక్రమం. మిగతాది అక్రమంగా వస్తున్నదే. ప్రధానంగా కలప వేకువజామున రవాణా జరుగుతోంది. అటవీ శాఖ సిబ్బందితో ముందస్తు ఒప్పందం జరిగినా.. ఒక వేళ పోలీసులతో ఇబ్బందులు తప్పవు. అందుకే ఉదయం 4 గంటల నుంచి 7 గంటల్లోగా ఈ కలప అక్రమ రవాణా సాగుతున్నట్టు సమాచారం. నీలగిరి మొక్కలను కూడా అత్యధికంగా పట్టుకుపోతున్నారు. వీటిని కోత యంత్రాలతో నేలకూలుస్తున్నారు. తక్కువ సమయంలో నరికే అవకాశం ఉండడంతో రెండో కంటికి తెలియకుండా పట్టుకుపోతున్నారు.
ఫ జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 29 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. అక్కడి నుంచి నీలగిరి, సరుగుడు పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఇవి తీరానికి రక్షణ కవచంలా ఉంటాయి. తీరం కోతకు గురికాకుండా కాపాడతాయి. విపత్తులు వచ్చినా అడ్డంగా నిలుస్తాయి. వాటిపై సైతం అక్రమార్కులు కన్నేసి దోచుకుపోతున్నారు. అటవీ శాఖ దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది.
చర్యలు తీసుకుంటాం
జిల్లాలో కలప అక్రమ రవాణాపై దృష్టిపెడతాం. సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నాం. ఎక్కడైనా కలప తరలిస్తున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. ఈ విషయంలో సొంత సిబ్బంది పాత్ర ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కలప అక్రమ రవాణాపై నిఘా పెంచాం. ఈ విషయంలో పోలీస్ శాఖ సహకారం సైతం తీసుకుంటున్నాం.
రవీంధ్రనాథ్ దామా, జిల్లా అటవీ శాఖ అధికారి, విజయనగరం