un official soil dregging in ponds తవ్వుకో.. దండుకో!
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:25 AM
un official soil dregging in ponds
తవ్వుకో.. దండుకో!
మట్టిని తవ్వుకుపోతున్న అక్రమార్కులు
చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
ఎక్కడబడితే అక్కడ భారీగా గుంతలు
ఫిర్యాదు చేస్తేనే అధికారుల్లో చలనం
అనుమానాలకు తావిస్తున్న రెవెన్యూ, జలవనరులశాఖ తీరు
- లక్కవరపుకోట మండలం గోల్జాం, వేపాడ మండలం ముకుందపురం గ్రామాల మధ్యలో ఉన్న చెరువులో కొద్ది రోజులుగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అక్కడున్న 11కేవీ విద్యుత్ స్తంభాల అంచు వరకు తవ్వేశారు. దారి కోసం చెట్లను తొలగించేశారు. మట్టిని తరలించేందుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు చెరువులో వరస కడుతున్నాయి.
- శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు గౌరిపురం అమ్మచెరువులో రోజూ పది ట్రాక్టర్లలో మట్టి తరలుతోంది. ఒకటి తరువాత మరొక ట్రాక్టర్‌లు వరసగా విశాఖ- అరకు రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు ఆగుతున్నాయి. తిరిగి రోజు గడవకముందే మట్టికోసం చెరువులోకి పరుగెడుతున్నాయి.
శృంగవరపుకోట, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఎక్కడికక్కడే మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఓ పక్క నదీపరివాహక ప్రాంతాల్లో ఇసుకను తవ్వుకుపోతున్నారు. మరోపక్క చెరువుల్లో మట్టిని తవ్వుకొని తరలించేస్తున్నారు. ఇంకోపక్క గ్రావెల్‌నూ వదలడం లేదు. వేటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడం లేదు. సంబంధిత అధికారులకు అనాధికారికంగా మామూళ్లు ముట్టజెప్పడం ద్వారా అక్రమంగా తవ్వుకు పోతున్నారు. ప్రకృతి వనరులను అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న మైనింగ్ అధికారులు ఇటువైపు చూడడం లేదు. మట్టి తవ్వకాలతో చెరువుల స్వరూపం మారుతుండడంతో వాటికి అడ్డుకట్టవేయాల్సిన జలవనరుల శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. మట్టితో రోడ్లపై తిరుగుతున్న ట్రాక్టర్లను చూసైనా దృష్టిసారించడం లేదు. ఇదంతా చూస్తున్న స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకేంటి సంబంధమన్న విధంగా రెవెన్యూ శాఖ వ్యవహరిస్తోంది. స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులను పంపించి తవ్వకాలను ఆపిస్తున్నారు. ఉదయం పూట ఆపితే సాయంత్రానికి, సాయంత్రం ఆపితే తెల్లారేసరికి తిరిగి చెరువుల్లో పొక్లయినర్‌లతో తవ్వకాలు మొదలైపోతున్నాయి. చెరువుల్లో నుంచి రోడ్లపైకి, రోడ్లపైనుంచి చెరువుల్లోకి ట్రాక్టర్లు రాకపోకలు సాగించేస్తున్నాయి. వాటిపట్ల రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేసవిని అదునుగా చేసుకుని..
వేసవి కాలం మొదలైంది. చెరువులన్నీ ఎండుతున్నాయి. ఇదే అదునుగా ఇటుక బట్టిలు, రియల్ ఎస్టేట్‌కు చెందిన యజమానులు ఈ చెరువులపై కన్నేశారు. గ్రామ పెద్దలను, అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. గ్రామాభివృద్ధికి ఎంతోకొంత సొమ్ము అందిస్తామని నమ్మబలుకు తున్నారు. వీరికి మట్టిని తవ్వే ఎక్సకవేటర్ల యజమానులు, మట్టిని తరలించే ట్రాక్టర్ల యజమానులు తోడయ్యారు. వీరంతా కలిసి సిండికేట్‌గా ఏర్పడి మట్టిని తవ్వుకొనేందుకు అనధికారికంగా అనుమతులు పొందుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు సహకరిస్తున్నారు. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
అధికారులూ అండగా..
అధికారులకు స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు క్షేత్రస్థాయికి సిబ్బందిని పంపిస్తున్నారు. ట్రాక్టర్లు, ఎక్సకవేటర్లను అక్కడ నుంచి పంపించేస్తున్నారు. అంతకు మించి ఎటువంటి చర్యలు ఉండడం లేదు. కొంత మంది అధికారులు ఫిర్యాదు ఇచ్చిన వారిపైకి మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వారిని ఉసుగొల్పుతున్నారు. వారితో భయపెట్టేలా చేస్తున్నారు. తిరిగి మట్టిని తవ్వుకొనేందుకు వీలుగా వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి తవ్వకం దారులు చెలరేగిపోతున్నారు. చెరువుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తవ్వేస్తున్నారు. ఈ సొమ్మును ఎక్సకవేటర్, ట్రాక్టర్ యజమానులు వాటాలు వేసుకుంటున్నారు.
చెరువుల స్వరూపం మార్చేస్తూ..
జిల్లాలో వున్న ట్రాక్టర్లు, పొక్లెయినర్‌లలో అత్యధిక శాతం మట్టి కంకర తవ్వకాలకు వినియోగిస్తున్నారు. నిబంధన ప్రకారం చెరువుల్లో మట్టిని తవ్వడం లేదు. ఎక్కడ పొక్లయినర్ పెట్టేందుకు అనుకూలంగా ఉంటే అక్కడ గుంతలు పెట్టేస్తున్నారు. చాలా చెరువుల నుంచి విద్యుత్ సరఫరాకు లైన్లు ఉన్నాయి. విద్యుత్ స్తంభాలకు ఆనుకుని తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్లు తిరిగేందుకు, పొక్లయినర్ తిప్పేందుకు ఏ రకం చెట్లు అడ్డంగా ఉన్నా తొలగించేస్తున్నారు. వీరు పెడుతున్న గుంతలతో చెరువంతా ఎగుడు, దిగుడుగా మారుతోంది. ఇలాయితే మదుముల వరకు సాగునీరు రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంతల్లో నీరుంతా వుండిపోతుందంటున్నారు. మట్టితవ్వే సమయంలో యజమానులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. దీనికితోడు చెరువుల్లో నీరున్న సమయంలో దిగిన పశువులను బయటకు తోలుకొచ్చే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. గుంతలున్నాయని తెలియక స్నానానికి వెళ్లినవారు ప్రమాదాల బారిన పడిన ఘటనలు జిల్లాలో కోకొల్లలు.
అనుమతులు తప్పనిసరి
చెరువుల్లో మట్టిని తీసుకొనేందుకు అనుమతులు పొందాలి. వ్యవసాయ అభివృద్ధికి మాత్రమే అనుమతులు ఇస్తారు. ఇది కూడా నిర్ణీత రుసుం చెల్లించిన యజమానులకే. నిబంధనల ప్రకారం జలవనరుల శాఖ ఇచ్చిన సూచన ప్రకారం తవ్వకాలు జరగాలి. అలా జరిగితే సాగునీటి ప్రవాహానికి ఇబ్బంది ఉండదు. గుంతల్లో పూడిక చేరే అవకాశం ఉండదు. పశువులు, మానవాళికీ ప్రమాదాలకు అస్కారం ఉండదు. ఎవరి అనుమతులు లేకుండ దొంగచాటుగా చెరువుల్లో తవ్వకాలు జరుగుతుండడంతో ముప్పు పొంచి ఉంది. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే కొనసాగితే పర్యావరణానికి నష్టం తప్పదని ఎస్.కోటకు చెందిన పర్యావరణ వేత్త బొబ్బిలి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.