ఉమా జూట్ మిల్లు షట్‌డౌన్ ఎత్తివేత
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:30 PM
మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటలో ఉన్న ధాన్యం(ఉమా జూట్) మిల్లులో షట్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
- సమాచారం ఇచ్చిన యాజమాన్యం
- కార్మికుల్లో ఆనందం
కొత్తవలస, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటలో ఉన్న ధాన్యం(ఉమా జూట్) మిల్లులో షట్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి జూట్ మిల్లును తెరుస్తామని చెప్పింది. ఈ మేరకు కార్మికులకు సమాచారం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన లేఖను కూడా అందజేసింది. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మిల్లులో సుమారు 450 మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇక్కడ పురి కొసలతో పాటు, గోనె సంచులు కూడా తయారవుతాయి. వీటి ప్రధాన ముడిసరుకు గోగు నార. గతంలో జిల్లాలో గోగును రైతులు విరివిగా పండించే వారు. ప్రస్తుతం జిల్లాలో గోగు సాగు పూర్తిగా పడిపోవడంతో పశ్చిమబెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్ నుంచి ఏజెంట్ల ద్వారా ఇక్కడకు జూట్ మిల్లులు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. పశ్చిమబెంగాల్‌లో పండిన పంట ఆ రాష్ట్రంలోనే మిల్లులకే సరిపోతున్నాయి. దీంతో ముడి సరుకు లేక ఉమా జూట్ మిల్లు యాజమాన్యం రెండు నెలల పాటు షట్‌డౌన్ విధించింది. అయితే, పశ్చిమబెంగాల్‌లో గోగునార పంట జూలై 15 నాటికి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నాలుగు లోడ్‌ల గోగునారను ఆ రాష్ట్రం నుంచి ఉమా జూట్ మిల్లు దిగుమతి చేసుకుని సిద్ధంగా ఉంచింది. ఈ నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుంచి మిల్లులో షట్ డౌన్ ఎత్తి వేస్తున్నట్టు యాజమాన్యం సమాచారం ఇచ్చింది.