Ullas.. Tus! ఉల్లాస్.. తుస్!
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:19 AM
Ullas.. Tus! వయోజన విద్యాశాఖ ఈనెల 4న జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఉల్లాస్ ఆంధ్ర పరీక్షలపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హోరెత్తిన విమర్శలు, ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా మమ అనిపించారని చెప్పుకుంటున్నారు. అభ్యాసకులుగా కొందరిని ఎంపిక చేసి.. ఒత్తిడితో పరీక్షకు తీసుకొచ్చి, తామే రాయించి.. ఫొటోలు తీసి.. మూల్యాంకనం చేసి.. మార్కులు వేసి ఆపై అప్‌లోడ్ చేసేశారు. అధికారులు రికార్డుల్లో కాకిలెక్కలు చూపి తమ పాత్ర పోషించారు. ఉన్నతాధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఉల్లాస్.. తుస్!
బోగస్ అభ్యాసకులే అంతా
బాధ్యతా రహితంగా వలంటీర్లు
రికార్డుల్లో కాకిలెక్కలు
కన్నెత్తి చూడని అధికారులు
వయోజన విద్యాశాఖ ఈనెల 4న జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఉల్లాస్ ఆంధ్ర పరీక్షలపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హోరెత్తిన విమర్శలు, ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా మమ అనిపించారని చెప్పుకుంటున్నారు. అభ్యాసకులుగా కొందరిని ఎంపిక చేసి.. ఒత్తిడితో పరీక్షకు తీసుకొచ్చి, తామే రాయించి.. ఫొటోలు తీసి.. మూల్యాంకనం చేసి.. మార్కులు వేసి ఆపై అప్‌లోడ్ చేసేశారు. అధికారులు రికార్డుల్లో కాకిలెక్కలు చూపి తమ పాత్ర పోషించారు. ఉన్నతాధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
మెంటాడ, మార్చి 8(ఆంధ్రజ్యోతి):
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, డ్వాక్రా సంఘాల సభ్యుల్లో ఉన్న నిరక్షరాస్యుల్లో దశలవారీగా కనీస అక్షరజ్ఞానం కల్పించే సదాశయంతో ప్రభుత్వాలు కొన్నాళ్లుగా విడతల వారీగా ఉల్లాస్ ఆంధ్ర పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,10,915 మందిని ఎంపిక చేసింది. ఈసారి డ్వాక్రా సభ్యులు 60,715 ఉండగా ఉపాధి హామీ పథకంలోని మగ వేతనదారులు 1000 మందిని ఎంపిక చేశారు. మెప్మా 12 వేల మందిని లక్ష్యంగా పెట్టుకుని విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 8000, బొబ్బిలి రూరల్‌లో 2000, రాజాం మునిసిపాలిటీ పరిధిలో 1000, నెలిమర్ల నగర పంచాయతీలో 1000 మందిని ఎంపిక చేశారు. వీరందరినీ అభ్యాసకులుగా తీర్చిదిద్దేందుకు వీరికి అక్షరజ్ఞానం కల్పించేందుకు వెలుగు, మెప్మా, ఉపాధి హామీ పథకం గ్రూపుల్లో చదువుకున్నవారిని వలంటీర్ టీచర్‌గా నియమించారు. వీరు అభ్యాసకులకు అనుకూలమైన సమయంలో అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో బోధించి కనీస అక్షరజ్ఞానం కల్పించాలనేది ఉల్లాస్ లక్ష్యం.
దొందూ దొందే
కార్యక్రమం పట్ల అభ్యసకులు, వలంటీర్ టీచర్లలో ఆసక్తి ఇసుమంత కూడా లేకపోవడంతో బలవంతపు తంతుగా మారిపోయింది. వారు వారు ఒక అంగీకారానికి వచ్చి నెలకోసారి ఎక్కడోచోట కూర్చుని బోధన జరుగుతున్నట్టు ఫొటోలు తీయించుకుంటున్నారు. వాటిని అధికారులకు పంపితే, వారేమో తాముమాత్రం తక్కువ తిన్నామా అన్నట్టుగా ముందే సిద్ధం చేసుకున్న కాకిలెక్కలకు ఈ దొంగ ఫొటోలను జతచేసి పైఅధికారులకు చేర్చి చేతులు దులిపేసుకోవడం జిల్లాలో ఆనవాయితీగా మారింది.
అంతా బోగస్...
పరీక్షల విషయానికొస్తే...వాటిని నిర్వహించేది, సమాధాన పత్రాలు దిద్దేది వలంటీర్ టీచర్లే. పరీక్ష రోజున గ్రూపు లీడర్లను బతిమాలో.. ఒత్తిడి చేసో కొందరు ఉపాధి వేతనదారులు, వెలుగు మహిళలను ఒకచోటుకు రప్పించి పరీక్ష నిర్వహిస్తున్నట్టుగా ఫొటోలు తీసి, ముందే నింపేసిన సమాధానపత్రాలపై మార్కులు వేసేసి, వాటిపై అభ్యాసకులతో వచ్చీరాని సంతకాలు చేయించేసి, అవీ రాకపోతే ఆ సంతకాలేవో వీరే చేసేసారు. నిరక్షరాస్యులను పరీక్షకేంద్రంలో కూర్చోబెట్టి ఫొటోలు తీసి వాటిని అధికారులకు పంపించారు. ఐదు, పది చదివిన వారిని పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్లి ఫొటోలు తీసిన బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. బోగస్ పరీక్షల బాగోతమంతా తెలిసికూడా వారేమో ఉల్లాస్ సక్సెస్ అంటూ షరామామూలుగా ప్రకటనలు చేసి, ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించడం బహిరంగ రహస్యమే.
పర్యవేక్షణ అందమైన అబద్ధం
అభ్యాసకుల గుర్తింపు లగాయితు పరీక్షల నిర్వహణ వరకు జరుగుతున్న ప్రహససానికి మండల, జిల్లా అధికారులే పూర్తి బాధ్యులని చెప్పడం అతిశయెక్తి కాదు. ఆరంభం నుంచి ముగింపు వరకు ఒక్కనాడైనా వారు పర్యవేక్షించే దాఖలాలు లేనేలేవు. వలంటీర్ టీచర్లు మొదలుకొని మండలస్థాయి అధికారుల వరకూ అందించే కాకిలెక్కలే వారికి ప్రామాణికమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై ఏనాడూ దృష్టి సారించే పాపానపోలేదు.
ఎవరి గోల వారిదే
పనులు మానుకొని ఈ వయసులో చదువులేమిటని అభ్యసకులు, స్వచ్ఛందంగా చాకిరీ ఎలా చేస్తామని వలంటీర్ టీచర్లు అంటున్నారు. నిధులు విదిల్చకుండా విధులు ఎలా నిర్వహిస్తామని సిబ్బంది వాపోతున్నారు. ఇలా ఎవరికివారు నిట్చూర్చుతూ ఉల్లాస్‌ని నీరుగార్చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద ఆరంభం నుంచి ముగింపువరకు అంతా హాస్యాస్పదంగా మారింది.
అక్షరం తెలియని వారికి వందల్లో మార్కులు
ఉల్లాస్ పరీక్షల్లో పాల్గొన్న అభ్యాసకులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. పరీక్ష ఎలా రాశారు? ఎలాంటి అనుభూతి పొందారని అడిగితే...కళ్లు బైర్లుకమ్మే సమాధానం ఇచ్చారు.పెన్ను,పుస్తకమంటే తెలియదని అక్షరం రాయడం, చదవడం రాదని అన్నారు. ఉపాధి పనుల్లో , మహిళా సంఘాల సమావేశాలు, బ్యాంకు రుణాలు పొందేటప్పుడు వేలు ముద్ర వేస్తున్నామని అన్నారు. ఏ నాడు సంతకం చేయలేదని చెప్పారు. అయితే ఇంతటి నిరక్ష్యరాసులైన అభ్యాసకులు ఉల్లాస్ అక్షర ఆంధ్ర పరీక్షలో పదుల్లో, ఇంకొందరు వందకు పైబడిన మార్కులు ఎలా సాధించారో అధికారులకే తెలియాలి.
మీటింగ్ పేరు చెప్పి రమ్మన్నారు
మెంటాడ గ్రామంలో డ్వాక్రా సభ్యురాలిగా ఉన్నాను. పదో తరగతి చదువుకున్న నన్ను మీటింగ్ ఉందని రమ్మన్నారు. తీరావెళ్లాక చేతిలో పుస్తకం పెట్టి నింపమన్నారు. ఎందుకు ఏమిటి అని అడిగితే ఏదేదో చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు చెప్పనట్టు నింపి ఇచ్చాను.తర్వాత తెలిసింది అవి ఉల్లాస్ పరీక్షలకు సంబంధించినవని
- సంచాన శాంతికుమారి, మెంటాడ గ్రామం
ఫొటో తీసి పంపేశారు
నాకు అక్షరం ముక్క రాదు. పెన్ను పేపర్ అంటే కూడా తెలీదు. అటువంటి నన్ను ఏదోపని ఉందని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి పుస్తకం ఒడిలో పెట్టి ఫొటో తీసుకొని వెళ్లిపోమన్నారు. ఉపాధి, పొదుపు మీటింగ్‌లలో వేలిముద్ర వేస్తున్నాను.
- బొట్టా పైడమ్మ, మెంటాడ గ్రామం.
-----------------