24న గజరాయునివలసలో ఉగాది
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:29 AM
రాష్ట్రమంతటా అన్నిగ్రామాల్లో ఉగాది ఒకేరోజు జరుపుకొంటారు. అయితే బాడంగి మండలం గజరాయునివలస గ్రామంలో ప్రత్యేకంగా మరోరోజు ఊరంతా ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
బాడంగి/బొబ్బిలి మార్చి (ఆంధ్రజ్యోతి):19 రాష్ట్రమంతటా అన్నిగ్రామాల్లో ఉగాది ఒకేరోజు జరుపుకొంటారు. అయితే బాడంగి మండలం గజరాయునివలస గ్రామంలో ప్రత్యేకంగా మరోరోజు ఊరంతా ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు ఈనెల 24వ తేదీ తెల్లవారుజామున 3.45 గంటలకు ఏరువాక ముహూ ర్తంగా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఆ గ్రామంలో ప్రతి ఏటా ఉగాది నాడు పంచాంగ శ్రవణం మాత్రమే నిర్వహిస్తారు. గురువారం గ్రామంలోని శ్రీరామమందిరంలో ఉగాది పురస్కరించుకుని సంప్రదాయ సిద్ధంగా పంచాంగ శ్రవణం జరుపుకొన్నారు. గ్రామ పురోహితులు కాలేటి రామకృష్ణ శర్మ గ్రామపెద్దలు, ప్రజల సమక్షంలో పంచాంగ శ్రవణం చేశారు. ఆయన నిర్ణయిం చిన ఏరువాక ముహూర్తం తేదీని, సమయాన్ని మైకుల ద్వారా గ్రామస్థులకు తెలియ జేశారు. ఈ ఆచారం ప్రకారం మంగళవారం వేకువజామున 3.45 గంటలకు ఏరువాక ముహూర్తంగా ప్రకటించారు. రైతులంతా కొత్తనాగళ్లను తయారు చేసుకొని భూమి దున్నేందుకు సన్నద్ధమవుతారు. ఇంటి ఆడపడుచులు, అల్లుళ్లను పిలిచి సంక్రాంతి మాదిరిగా సందడిగా ఉగాది పండును ఏరువాక ముహూర్తంనాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో గల బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల కుటుంబాలు గురువారం ఉగాది జరుపుకొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మూడడ్ల సత్తిబాబు, ఉపసర్పంచ్ తెర్లి కామినాయుడు, గ్రామపెద్దలు గునుపూరు కృష్ణమూర్తి, మూడడ్ల అచ్చుతరావు, బీపీఎం సింహాచలం, నల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.