Share News

జనసేనకు రెండు మున్సిపాలిటీలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:40 AM

జిల్లాలో సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీని జనసేన పార్టీకి, పార్వతీపురం పురపాలక సంఘాన్ని టీడీపీకి కేటాయిస్తూ గురువారం రాత్రి ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.

 జనసేనకు రెండు మున్సిపాలిటీలు

- సాలూరు, పాలకొండ కేటాయింపు

- పార్వతీపురం టీడీపీకి..

పార్వతీపురం,అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీని జనసేన పార్టీకి, పార్వతీపురం పురపాలక సంఘాన్ని టీడీపీకి కేటాయిస్తూ గురువారం రాత్రి ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో సీట్ల సర్దుబాటుకు తెరపడినట్లయింది. పాలకొండను మొదటి నుంచి జనసేనకు కేటాయిస్తారని ప్రచారంలో ఉండగా అదే నిజమైంది. సాలూరును టీడీపీకి కేటాయిస్తారని అంతా భావించినప్పటికీ అనుహ్యంగా జనసేనకు దక్కింది. దీంతో టీడీపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం పురపాలక సంఘాన్ని ఏ పార్టీకి కేటాయిస్తారో అన్న అనుమానాలు ఇంత వరకూ ఉండేవి. అయితే, టీడీపీకి కేటాయించడంతో శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

సహకారం ఎలా ఉంటుందో..?

సాలూరు పురపాలక సంఘాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కేడర్‌కు, ప్రధానంగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఈ ప్రకటనతో ఖంగుతిన్నారు. సాలూరు పట్టణం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ సాలూరులో మంచిపట్టు ఉంది. అటువంటి స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లకు షాక్‌ తగిలినట్లు అయింది. చైర్‌పర్సన్‌ సీటు కోసం టీడీపీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ ఆగమేఘాలపై ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇలాంటి ఆశావహులు అంతా జనసేన విజయానికి ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Oct 16 , 2026 | 12:40 AM