Two days of work at the same time!రెండు రోజుల పనికి ఒకే మస్తరు!
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:39 AM
Two days of work at the same time! జిల్లాలో ఉపాధి హామీ పథకంలో మస్తర్ల మాయాజాలంలో కొత్త కోణమిది. రెండు రోజుల పనిని కలిపి రెండో రోజు ఎన్‌ఎంఎంఎస్ ద్వారా మస్తర్లు వేస్తున్నారు. తద్వారా మెజారిటీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు కనీస వేతనమే చెల్లిస్తున్నట్లు అడ్డదారిలో చూపిస్తున్నారు. అడిగేవారు లేరనే ధీమాతో అతితెలివి ప్రదర్శిస్తూ కూలీలతోపాటు కేంద్రప్రభుత్వాన్నీ బురిడీ కొట్టిస్తున్నారు.
రెండు రోజుల పనికి ఒకే మస్తరు!
ఉపాధి అక్రమాల్లో కొత్తకోణం
ఫీల్డ్ అసిస్టెంట్ల నయా మోసం
కనీస వేతనం పేరుతో కూలీలకు జెల్ల
ఉద్యోగాన్ని కాపాడుకోడానికి ఎత్తుగడ
వేతనదారుల శ్రమ దోపిడీ
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో మస్తర్ల మాయాజాలంలో కొత్త కోణమిది. రెండు రోజుల పనిని కలిపి రెండో రోజు ఎన్‌ఎంఎంఎస్ ద్వారా మస్తర్లు వేస్తున్నారు. తద్వారా మెజారిటీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు కనీస వేతనమే చెల్లిస్తున్నట్లు అడ్డదారిలో చూపిస్తున్నారు. అడిగేవారు లేరనే ధీమాతో అతితెలివి ప్రదర్శిస్తూ కూలీలతోపాటు కేంద్రప్రభుత్వాన్నీ బురిడీ కొట్టిస్తున్నారు.
మెంటాడ, మార్చి1(ఆంధ్రజ్యోతి) :
ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీగా చేసిన మార్చు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన పనిదినాలను పూర్తి చేయడానికి పాత పేరుతోనే పనులు ప్రారంభించారు. దీంతో పల్లెల్లో మళ్లీ పనుల సందడి మొదలైంది. పెరుగుతున్న ధరల సూచీకి అనుగుణంగా ఉపాధి వేతనదారుల కనీస వేతనం రూ.307గా నిర్ణయించిన కేంద్రం....ఆ మేరకు పనులు జరిగేలా చూడాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రోజుకు రూ.120నుంచి రూ.140చొప్పున మాత్రమే వేతనదారుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఎవరైనా అడిగితే మీరు ఎంతపని చేస్తే అంతే వస్తుందని బుకాయిస్తున్నారు. చేసేదిలేక కూలీలు సర్దుకుపోతున్నారు.
జరుగుతున్నదిలా..
ఫీల్డ్ అసిస్టెంట్లు ముందుగా డి మస్తర్లు వేశాక ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్‌లో అప్లోడ్ చేస్తే అది నేరుగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే ఎన్‌ఐఆర్ సర్వర్‌కు చేరుతుంది. వేతనదారులకు ఎంత గిట్టుబాటు అవుతున్నదీ ఉన్నతాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే అలా చేయకుండా రెండు రోజుల పనిని కలిపి రెండో రోజు ఎన్‌ఏంఏంఎస్ ద్వారా మస్తర్లు వేస్తున్నారు. కనీస వేతనంలో సగం కూడా గిట్టుబాటు కాకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లను బాధ్యుడ్ని చేసి అక్షింతలు తప్పవు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ఒక్కటైపోయి వేతనదారులు రెండురోజుల్లో చేసిన పనిని ఒక్కరోజులోనే చేసినట్టుగా చూపిస్తున్నారు. ఈ విధంగా పెంచిన కనీస వేతనం గిట్టుబాటు అయ్యేలా కథ నడిపిస్తున్నారు.
ఫ ఫీల్డ్ అసిస్టెంట్ల స్వార్థానికి కూలీలు బలవుతున్నారు. రెండురోజులు పనిచేయించి ఒక్కరోజుకే మస్తర్లు వేయడం వల్ల శ్రమదోపిడీకి గురవుతున్నారు. చేసిన పనికి వేతనాలు జమయ్యేందుకు దాదాపు నెలరోజులుపైనే పడుతున్నందున, ఈలోపు తాము ఎన్నిరోజులు పనిచేసిందీ మర్చిపోయి, జమైన డబ్బుతో సరిపెట్టుకుంటున్నారు. ఈ బాగోతం తెలిసినప్పటికీ కొందరు అధికారులు కిమ్మనకపోడం వారి బాధ్యతారాహిత్యాన్ని చాటిచెప్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పని కల్పించడంలో వెనుకంజ
వేతనదారులకు పని కల్పించడంలో అధికారులు వెనుకబడ్డారు.జిల్లాలో 5.45 లక్షలమంది వేతనదారులు ఉండగా కేవలం 51 వేలు మందికి మాత్రమే పనికల్పిస్తున్నారు.దీంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో విజయనగరం జిల్లా 24వ స్థానానికి పరిమితం అయ్యింది. వందరోజుల పనిదినాలు నినాదం అందమైన అబద్ధంగా మారింది. 3.38 లక్షల జాబ్ కార్డుల్లో నూరురోజులు పనిదినాలు పొందింది కేవలం పదివేల కుటుంబాలే. మిగతా వారికి అరకొర పనిదినాలు కల్పించినట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.
ఫిర్యాదు వస్తే చర్యలు
రెండురోజుల పనికి ఒక్కరోజే మస్తర్లు వేయడం నా దృష్టికి రాలేదు. అలాచేస్తే ముమ్మూటికీ తప్పే. ఇంతవరకు ఫిర్యాదు అందలేదు. ఎవరైనా నా దృష్టికి తీసుకువస్తే విచారించి చర్యలు తీసుకుంటాను. ఒకటో రెండో చోట్ల తప్పు జరిగితే జరిగుండొచ్చు
- చినప్పయ్య, ఏపీవో, మెంటాడ మండలం
----------------