Share News

tuffan effect విరుచుకుపడిన ఆర్నబ్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:22 AM

tuffan effect ఆర్నబ్‌ తుఫాన్‌పై జిల్లా ప్రజలు భయపడినట్టే విరుచుకుపడింది. ప్రధానంగా ఈదురుగాలుల బీభత్సానికి మంగళవారం రాత్రి చాలా చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి

tuffan effect విరుచుకుపడిన ఆర్నబ్‌
ఎస్‌.కోట సమీపంలో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభం

విరుచుకుపడిన ఆర్నబ్‌

ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

చాలా మండలాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా

గరిష్ఠ వర్షపాతం 84.5 మిల్లీమీటర్లుగా నమోదు

సహాయక చర్యలకు దిగిన అధికారులు

విజయనగరం అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):

ఆర్నబ్‌ తుఫాన్‌పై జిల్లా ప్రజలు భయపడినట్టే విరుచుకుపడింది. ప్రధానంగా ఈదురుగాలుల బీభత్సానికి మంగళవారం రాత్రి చాలా చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. సుమారు 200 చెట్లు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో విద్యుత్‌ సంభాలు విరిగిపడ్డాయి. బుధవారం తుఫాన్‌ తీరం దాటనుండడంతో ఆ సమయంలో మరింత వేగంగా గాలులు వీచే ప్రమాదముంద ంటున్నారు. మరోవైపు తుఫాన్‌ సహాయక చర్యల్లో భాగంగా విద్యుత్‌ శాఖ అధికారులు 600 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో ఉండి కంట్రోల్‌ రూమ్‌ద్వారా అధికారులకు సూచనలు ఇచ్చారు. తీరప్రాంత గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారు. 2600 విద్యుత్‌ స్తంభాలను, 300 ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచినట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఎం.లక్ష్మణ్‌రావు కలెక్టర్‌కు వివరించారు. వరి, పత్తి, చెరకు, బొప్పాయి, మునగ పంటలతో పాటు ఉద్యాన పంటలకు నష్టం కలిగింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో బుధవారం నష్టం తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు టెన్షన్‌తో ఉన్నారు.

ఫ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 84.5 మిల్లీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తవలస మండలంలో 181.4 మిల్లీమీటర్లు, తెర్లాం మండలంలో అత్యల్పంగా 44.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మండలాల వారీగా వర్షపాతం

1.భోగాపురం 128.8

2.జామి 124.4

3.గుర్ల 120.8

4.నెల్లిమర్ల 108.0

5.ఎల్‌.కోట 108.0

6.గంట్యాడ 104.8

7.విజయనగరం 98.8

8.వేపాడ 88.6

9.పూసపాటిరేగ 87.6

10.బొండపల్లి 85.8

11.మెంటాడ 84.2

================

కుండపోత

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో సామాన్య, మధ్యతరగతి, చిరువ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమైంది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అధికారులు తుఫాన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ముందస్తుగా విద్యాలయాలకు సెలవు ప్రకటించడం వల్ల విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు.

ముందుకొచ్చిన సముద్రం

భోగాపురం, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత గ్రామాలైన ముక్కాం, కొండ్రాజుపాలెం, చోడిపిల్లి పేట, ఎర్రముసలయ్యపాలెం, చేపలకంచేరు ప్రజలు తీవ్ర గాలులకు వణికిపోతున్నారు. కెరటాలు భీకర శబ్ధంతో తీరాన్ని తాకుతున్నాయి. సముద్ర నీటి మట్టం ఎత్తు పెరగడంతో పాటు ముక్కాం తీరంలో సుమారు 75 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చింది. దీంతో తీరంలో ఉంచిన పడవలను మత్స్యకారులు ఇళ్లకు వద్దకు తీసుకొచ్చి తాళ్లతో కట్టి భద్రపరుచుకొన్నారు. మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ పి.రమేష్‌ గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులకు సూచనలు ఇచ్చారు. అవసరమైతే పునరావాస కేంద్రలకు తరలిరావాలని సూచించారు.

మడ్డువలస నుంచి నీరు విడుదల

వంగర, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): మడ్డువలస రిజర్వాయర్‌ ఐదు గేట్ల ద్వారా 10.040 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 65 మీటర్లు కాగా ప్రస్తుతం 63.73మీటర్లకు చేరింది. వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో పెరగడంతో అప్రమత్తమైన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ ప్రధాన గేట్ల నుంచి 9.530 క్యూసెక్కులను నాగావళి నదిలోకి విడుదలచేయగా పంటలకు ఎడమ కాలువద్వారా 5 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 10 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Oct 28 , 2026 | 12:22 AM