Share News

tuamor in the brain.. there is no need to fear. మెదడులో కణితా.. భయం అక్కర్లే

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:55 PM

tuamur in the brain.. there is no need to fear.

tuamor in the brain.. there is no need to fear. మెదడులో కణితా.. భయం అక్కర్లే

మెదడులో కణితా.. భయం అక్కర్లే

అందుబాటులో అత్యాధునిక చికిత్స

ముందుగానే గుర్తిస్తే సులువుగా నయం

నేడు వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ డే

బ్రెయిన్‌ ట్యూమర్‌ (మెదడులో కణితి).. ఒకప్పుడు ఈ మాట వింటే రోగులు, వారి కుటుంబ సభ్యులు భయపడేవారు. శస్త్ర చికిత్స చేస్తే బతకడం కష్టం అనే అపోహలు జనాల్లో బలంగా వుండేవి. కాని నేడు వైద్య రంగం సాధించిన ప్రగతి ఆ భయాలన్నింటినీ పటాపంచలు చేస్తోంది. ప్రారంభ దశలోనే లక్షణాలను గుర్తిస్తే అత్యాఽధునిక సాంకేతికతతో మెదడు కణితులను విజయవంతంగా నయం చేయవచ్చునని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈ నెల 8న వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ దినం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి):

శరీరంలో పాత కణాలు చనిపోతూ, కొత్త కణాలు రావడం సహజ ప్రక్రియ. కాని మెదడులోని కొన్ని కణాలు ఈ నియంత్రణ కోల్పోయి అసాఽధారణంగా పెరిగి ఒక కణజాల ముద్దగా మారతాయి. దీనినే మెదడు కణితి లేదా ట్యూమర్‌ అంటారు. కణాల డీఎన్‌ఏలో వచ్చే మార్పుల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది. కణితి పెరిగే కొద్దీ మెదడు లోపలి స్థలాన్ని ఆక్రమించి, చుట్టుపక్కల నరాలపై ఒత్తిడి తెస్తుంది.

కారణాలు ఇవే

కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా, జన్యుపరమైన సమస్యలు వుంటే, పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అరుదైన జన్యు సిండ్రోమ్‌లు వున్న వారిలో ఈ ప్రమాదం ఎక్కువ. చిన్నతనంలో వేరే ఏదైనా క్యాన్సర్‌ చికిత్స కోసం తలకు అధిక మోతాదులో ఎక్స్‌రేలు లేదా రేడియేషన్‌ చేయాల్సి వస్తే భవిష్యత్తులో కణితులు వచ్చే ప్రమాదం ఉంది.

- శరీర బరువు విపరీతంగా పెరగడం వల్ల మెదడులో కణితి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావం దీనిపై ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

- ధూమపానం, మద్యపానం, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఏ వయసు వారికైనా రావచ్చు. వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో దీని తీవ్రత పెరుగుతుంది. కొన్ని రకాల కణితులు మాత్రం కేవలం చిన్న పిల్లల్లో మాత్రమే ఎక్కువగా కన్పిస్తాయి.

లక్షణాలు ఇవే

ఉదయం నిద్రలేచిన సమయానికి తలనొప్పి తీవ్రంగా వుండడం రోజులు గడిచేకొద్దీ ఈ నొప్పి మరింతగా పెరుగుతుంది. తలనొప్పితో పాటు అకారణంగా వాంతులు కావడం, వికారంగా అన్పించడం జరుగుతుంది.

- కంటి చూపు మసకబారడం వస్తువులు రెండుగా కన్పించడం ( డబుల్‌ విజన్‌ ) జరుగుతుంది.

- నడుస్తున్నప్పుడు బ్యాలన్స్‌ తప్పడం, తరచుగా పడిపోవడం, చేతులు కాళ్లల్లో బలహీనత, ఒకవైపు తిమ్మిరి రావడం కన్పిస్తాయి.

- ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా హఠాత్తుగా మూర్చ లేదా ఫిట్స్‌ రావడం ప్రధాన లక్షణం.

- మాట్లాడేటప్పుడు తడబడడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చిన్న చిన్న విషయాలకే చిరాకు పడడం గమనించవచ్చు.

మెదడు కణితుల్లో రకాలు

బెనైన్‌ (క్యాన్సర్‌ కానివి). ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా తొలగిస్తే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఇవి మహిళల్లో ఎక్కువగా కన్పిస్తాయి.

- మాలిగ్నెంట్‌ (క్యాన్సర్‌ కారకాలు) ఇవి అత్యంత వేగంగా పెరుగుతూ, మెదడులోని ఇతర ఆరోగ్యకరమైన భాగాలను దెబ్బతీస్తాయి. ఇవి పురుషుల్లో ఎక్కువగా కన్పిస్తాయి.

పరీక్షలు ఇవే

కణితిని గుర్తించేందుకు నరాల సామార్థ్య పరీక్ష, రోగి చూపు, వినికిడి, శరీర సమతుల్యత, స్పందనను వైద్య నిపుణులు, ప్రాథమికంగా పరిశీలిస్తారు.

- సిటి స్కాన్‌ ద్వారా ఎక్సరే కిరణాలతో మెదడు లోపలి భాగాలను చిత్రాలుగా మార్చి కణితి ఉనికిని గుర్తిస్తారు.

- ఎంఆర్‌ఐ స్కాన్‌ ద్వారా రేడియో తరంగాలను ఉపయోగించి మెదడులో అత్యంత సూక్ష్మమమైన త్రీ డీ చిత్రాలను తీస్తారు. కణితి ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవడానికి ఇది అత్యుత్తమ పరీక్ష

- కణాజాల పరీక్ష కణితి నుంచి చిన్న ముక్కను సేకరించి పరీక్షించడం ద్వారా క్యాన్సరా? కాదా అన్నది నిర్ధారిస్తారు.

నూతన చికిత్స.. ఔషధాలు

కణితి కనుక మాటలు, కదలికలను నియంత్రించే మెదడు భాగాలకు దగ్గరగా వుంటే రోగిని పూర్తిగా స్ప్రహాలో వుంచి ఆపరేషన్‌ చేస్తారు. సర్జన్‌ శస్త్ర చికిత్స చేస్తూ రోగితో మాట్లాడుతుంటారు. దీని వల్ల మాట పడిపోకుండా, కణితిని సురక్షితంగా తొలగించవచ్చు.

- వందలాది సూక్ష్మ రేడియేషన్‌ కిరణాలను నేరుగా కణితిపైనే కేంద్రీకరించి దానిని నాశనం చేస్తారు. దీని వల్ల తలకు కోత కాని, కుట్లు గాని పడవు. ఔషదాలు ద్వారా కణితిని జన్యుపరీక్ష చేసి అది పెరగడానికి కారణమైన జన్యువులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తొలగిపోయేందుకు ప్రత్యేక ఔషధాలు అందిస్తున్నారు.

క్లిష్ట పరిస్థితిలోనూ చికిత్స

డాక్టర్‌ పీఎస్‌వీ రామారావు, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్టు, విజయనగరం

బ్రెయిన్‌ ట్యూమర్‌ రోగుల్లో కొన్నిసార్లు అకస్మాత్తుగా మెదడు లోపల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి, తీవ్రమైన పిట్స్‌ రావడం లేదా స్ప ృహ తప్పి కోమాలోకి వెళ్లడం వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇటువంటి క్లిష్ట సమయాల్లో క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ పాత్ర అత్యంత కీలకం. రోగిని ఐసీయూలో చేర్చిన వెంటనే మెదడుపై ఒత్తిడిని తగ్గించే ప్రత్యేక లైఫ్‌ సపోర్టు వ్యవస్థలు, అధునాతన ఔషధాలు అందిస్తాం. లక్షణాలు తీవ్ర రూపం దాల్చినప్పుడు సొంత వైద్యం చేయకుండా తక్షణమే వైద్య నిపుణులు సంప్రదించి ఆసుపత్రులో చేర్చితే, రోగి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.

లక్షణాలు కన్పిస్తే అశ్రద్ధ చేయొద్దు

డాక్టరు జగదీష్‌కుమార్‌, న్యూరాలజిస్టు, విజయనగరం

మెదడు కణితి అనగానే భయపడాల్సిన పనిలేదు. వారసత్వ లోపాలు లేదా రేడియేషన్‌ ప్రభావం వంటి వివిధ కారణాల వల్ల ఇవి రావచ్చు. నిరంతర తలనొప్పి ఉదయాన్నే వాంతులు కావడం, చూపు మసకబారడం హఠాత్తుగా మూర్చరావడం వంటి లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. నేడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక పరీక్షలు ద్వారా కణితిని తొలి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గుతుంది. ముక్కు ద్వారా చేసే ఎండోస్కోపిక్‌ సర్జరీలు, మైక్రో సర్జరీల వల్ల ఎంతో సురక్షితంగా కణితులను తొలగించవచ్చు. బ్రెయిన్‌ ట్యూమర్‌కు నేడు అత్యాధునిక చికిత్సలు, ఔషధాలు అందుబాటులో వున్నాయి.

---------------------

Updated Date - Jun 07 , 2026 | 11:55 PM