Share News

ఖరీఫ్‌లో కష్టాలేనా?

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:39 AM

ఖరీఫ్‌ వచ్చేసింది. సంతృప్తిగా వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితిలో ధీమాగా ఉండాల్సిన తోటపల్లి పంట కాలువ అధ్వానంగా ఉంది. పిచ్చిమొక్కలు, పూడికతో కనిపిస్తోంది. శివారు ఆయకట్టుదారులకు నీరందే పరిస్థితే లేదు. అయినా కాలువలో చేపట్టాల్సిన పనులు చేయకుండా అధికారులు నీరు విడుదల చేసేశారు. ఎందుకిలా చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఖరీఫ్‌లో కష్టాలేనా?
పొదలతో నిండిన తోటపల్లి కుడి ప్రధాన కాలువ

  • ఖరీఫ్‌లో కష్టాలేనా?

  • అయోమయంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ ఆయకట్టుదారులు

  • పిచ్చి మొక్కలతో కాలువ

  • చేపట్టని లైనింగ్‌ పనులు

  • పిల్ల కాలువల ఊసే లేదు

  • పనులు పూర్తి కాకుండానే నీరు విడుదల

చీపురుపల్లి, జులై 7 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి కుడి ప్రధాన కాలువ కిందనున్న ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో ఎలా గట్టెక్కాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా శివారున ఉన్న రైతులు సాగునీటి లభ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువలో చాలా కీలకంగా పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయి. అవేవీ కొలిక్కిరాకుండా ఈ నెల 2న కుడి ప్రధాన కాలువకు నీటిని విడిచిపెట్టారు. దీనివల్ల తమకు ఒరిగేది ఏమీ ఉండదని కాలువ చివరి ఆయకట్టుదారులు అంటున్నారు. కాలువలో పూడికతీత పనులు చేయకపోవడం, పిచ్చి మొక్కల్ని తొలగించక పోవడం వల్ల నీటి ప్రవాహం తక్కువగా ఉంటోందని శివారు ఆయకట్టుదారులు కిందటేడాది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. అయినా పరిష్కారం కాలేదు.

కుడి ప్రధాన కాలువ పరిథిలో దాదాపు అన్ని మండలాల్లోనూ పిల్ల కాలువల తవ్వకం, ప్రధాన కాలువలకు లైనింగ్‌, ఇతర చిన్నపాటి పెండింగ్‌ పనులకు సంబంధించిన భూ సేకరణ తదితర పనుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేయడంతో ఈ పనులు ముందుకు సాగలేదు. ఈ పరిస్థితుల్లో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్‌ పనులు చకచకా సాగుతాయని రైతులు భావించారు. ఎమ్మెల్యే కళావెంకటరావు కూడా తోటపల్లి పెండింగ్‌ పనులకు నిధులు మంజూరు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రిని కోరారు. సుమారు రూ.18 కోట్లు వెచ్చిస్తే పూడిక తీత పనులు పూర్తవుతాయని వివరించారు.

ఫ ఈ ఖరీఫ్‌కు ముందే పూడిక తీత, లైనింగ్‌ పనులు, పిల్ల కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయడానికి పలు ప్రయత్నాలు చేశారు. అయితే ఇవేవీ జరగకుండానే ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయడంపై ఆయకట్టు రైతులు నిరాశ చెందుతున్నారు. కుడి ప్రధాన కాలువకు చివరలో ఉన్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, గరివిడి, గుర్ల అటు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలాల్లోని భూములకు సకాలంలో నీరందడం ప్రఽశ్నార్థకమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా చీపురుపల్లి వద్ద తవ్విన గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులు కూడా ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఈ ఖరీఫ్‌ నాటకి ఆ పనులు కూడా కొంత మేరకు పూర్తవుతాయని అక్కడి రైతులు ఆశ పడ్డారు. జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే కుడి ప్రధాన కాలువ పనులు పెండింగ్‌లో ఉండడం రైతుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

Updated Date - Jul 08 , 2026 | 10:48 AM