Share News

గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:42 PM

గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు.

 గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందాలి
మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి

- రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి

పార్వతీపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. గిరిజనుల సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు కమిషన్‌ ఉందన్నారు. జిల్లా స్థాయిలో యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలన్నారు. కలెక్టర్‌ వినూత్న ఆలోచనతో చేసిన ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. మన్యం డ్యాన్స్‌, ఆనందలహరి ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు నూతన ఉత్తేజం, ఉత్సాహంతో వారు చదువుకుంటారని అన్నారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే శతశాతం ఫిర్యాదులను పరిష్కరించి జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. పునర్విభజనలో భాగంగా ఏర్పడిన బ్యాక్‌లాగ్‌ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామన్నారు. పర్యాటక అభివృద్ధికి జిల్లా ఒక నమూనాగా నిలుస్తుందని అన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఎస్టీలపై దాడులకు సంబంధించి గత ఏడాది నాలుగు కేసులు, ఈ ఏడాది రెండు కేసులు నమోదైనట్లు చెప్పారు. ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరించాలని కమిషన్‌ చైర్మన్‌ ఆదేశించారు. ముందుగా జిల్లాలో గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలపై జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా చైర్మన్‌కు వివరించారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు..

గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి అన్నారు. గురువారం ఐటీడీఏ గిరిమిత్ర హాల్‌లో గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల నుంచి ప్రధానంగా తాగునీరు, రోడ్లు సౌకర్యం వంటి మౌలిక వసతులపై ఫిర్యాదులు అందాయన్నారు. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు, భూ హక్కుల అంశంపై వినతులు సమర్పించారన్నారు. వీటిని పరిశీలిస్తామన్నారు. సీఆర్‌టీలుగా గిరిజనులను నియమించే అంశంపై చర్యలు తీసుకుంటానన్నారు. అంతకుముందు ఐటీడీఏ కార్యాలయానికి వచ్చిన చైర్మన్‌ను జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అడవితల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యులు గొర్లె సునీత, కడ్రక మల్లేశ్వరరావు మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా వివిధ గ్రామాలను సందర్శించి ఐటీడీఏలో సమీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. జిల్లాలు విడిపోవడం వల్ల సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటిని పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, కౌన్సిల్‌ మెంబర్‌ కృష్ణబాబు, మాజీ శాసన సభ్యుడు జయరాజు, ఐటీడీఏ ఏపీవో మురళీధర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:42 PM