Share News

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:41 PM

సీతంపేట ఏరియా ఆసుపత్రిలో గిరిజనులతో పాటు గిరిజనేతరులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి ఆదేశించారు.

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారితో మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి

- ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి చర్యలు

- పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

- రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి

సీతంపేట రూరల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రిలో గిరిజనులతో పాటు గిరిజనేతరులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి ఆదేశించారు. సీతంపేట ఏజెన్సీలో బుధవారం ఆయన పర్యటించారు. తొలుత ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. చిన్నపిల్లల వార్డును పరిశీలించి చికిత్స పొందుతున్న చిన్నారులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యంతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పెథాలజిస్ట్‌, ఆప్తలమిస్ట్‌ వైద్యులు లేరని, శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు చెప్పారు. సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదించి పోస్టుల భర్తీకి చర్యలు చేపడతానని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషిచేస్తామని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ను సందర్శించారు. ఫ్లవర్‌ గార్డెన్‌ను పరిశీలించి సెల్ఫీలు దిగారు. సీతంపేట మన్యం అందాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తుందని ఆయన అన్నారు. అక్కడి నుంచి ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి గిరిజన సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమస్యలపై గిరిజన సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. సీతంపేటలో గిరిజన భవన్‌ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు కోరారు. సీతంపేటలోని నాలుగు చెరువులను కొందరు మట్టితో కప్పేసి ప్లాట్లగా విక్రయిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని, శ్మశానవాటిక స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదివాసీ సంఘాల నాయకులు బి.తేజేశ్వరరావు, బి.ఉమామహేశ్వరరావు, రామ్మోహనరావు, గోపి, అజయ్‌ వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యలను ఐటీడీఏ పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ పరిష్కరిస్తారని, లేదంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎస్టీ కమిషన్‌ సభ్యులు గొర్లె సునీత, కడ్రక మల్లేశ్వరరావు, ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు, డీడీ ఎం.అన్నాదొర, పాలకొండ డీఎస్పీ రాంబాబు, కూటమి నాయకులు హెచ్‌ ప్రసాద్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి పర్యటన వివరాలు..

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి రెండో రోజు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఉదయం 9 గంటలకు గిరిజన సంఘాలు, గిరిజన నాయకులు, స్థానికుల నుంచి వినతిపత్రాలు తీసుకుంటారు. 10.30 నుంచి 1.30 వరకు కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం చినగుడబలోని ప్రైవేటు మైనింగ్‌ సంస్థను సందర్శిస్తారు. 3.15 నుంచి 4 గంటల వరకు స్థానిక గిరిజనులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు. సాయంత్రం 4.10 నుంచి 5 గంటల వరకు కొమరాడ మండలం చినఖేరజాల గ్రామంలో పర్యటిస్తారు. 5.30లకు పార్వతీపురంలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఆరు గంటలకు బయలుదేరి విశాఖపట్నం వెళ్లనున్నారు.’అని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Mar 25 , 2026 | 11:41 PM