Share News

Tribal Welfare గిరిజనుల సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:14 AM

Tribal Welfare Is the Goal గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అభివృద్ధికి కూటమి సర్కారు కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఐటీడీఏ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

Tribal Welfare   గిరిజనుల సంక్షేమమే లక్ష్యం
సభలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు

  • ఆదివాసీ దినోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు

  • వేడుకలకు హాజరైన మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు

పార్వతీపురం టౌన్‌, ఆగస్టు8(ఆంఽధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అభివృద్ధికి కూటమి సర్కారు కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఐటీడీఏ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా సభ వేదిక వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రధానంగా రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోంది. తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.1,065 కోట్లతో సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర బీటీ రహదారుల నిర్మాణం చేపట్టింది. రెండో విడతలో రూ.2,600 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.900 కోట్లు రోడ్ల కోసం వెచ్చించింది. గిరి శిఖర గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించి.. డోలీ మోతలకు శాశ్వతంగా ముగింపు పలుకుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా 16వేల ఉపాధ్యాయ, ఉద్యోగ పోస్టులను భర్తీ చేసింది. అందులో 2,200పైగా ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాం తాలకు చెందిన గిరిజన యువతకు దక్కాయి. జీవో నంబరు 3 విషయంలో గిరిజనులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. మా వద్ద పూర్తి రికార్డులు ఉన్నాయి. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నియామకాలు చేపట్టాం. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రాఽఽధాన్యం ఇస్తున్నారు. నేరేడి బ్యారేజీ, తోటపల్లి ప్రాజెక్టుల పెండింగ్‌ పనులను పూర్తి చేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాం. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు విద్య, ఉపాఽధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గిరిజనుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సర్కారు నిరంతరం కృషి చేస్తోంది. ’ అని తెలిపారు.

గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలి: మంత్రి సంధ్యారాణి

ఆదివాసీ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవడం అందరి బాధ్యత. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమంపై చర్చిందేకు జిల్లాలో మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నాం. గిరిజనుల స్థితిగతులను మార్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కుతుంది. కిలో రూ.2కే బియ్యంతో పాటు కాకుండా ఏజెన్సీప్రాంతాల అభివృద్ధికి అప్పట్లో ఐటీడీఏలను స్థాపించారు. జీవో నంబరు 275 ద్వారా గిరిజనులకు ఉద్యోగావ కాశాలు కల్పించారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలనూ ఏర్పాటు చేశారు. జీవో నంబరు 3 వల్ల గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడడానికి కారణం ఆ మహనీయుడే. గడిచిన రెండేళ్లలో 11వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. సీఎం చంద్రబాబు మెగా డీఎస్పీ ద్వారా గిరిజన నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపారు.’ అని తెలిపారు.

వేడుకల్లో ఎవరెవరు ఏమన్నారంటే..

- గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని ప్రభుత్వ విప్‌, తోయక జగదీశ్వరి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఒక బిడ్డకే అమ్మఒడి పథకం వర్తించేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుటుంబంలో చదువుతున్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకం వర్తింపుజేస్తోందన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కూటమికే దక్కుతుందన్నారు. సీఎం చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు.

- గిరిజనాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ మార్గ దర్శకంలో గిరిజన విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది పది, ఇంటర్‌ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచారని తెలిపారు. వ్యవసాయ రంగంలో గతంలో ఎకరాకు 20 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 30 నుంచి 35 బస్తాల దిగుబడి సాధించి మన్యం జిల్లా సరికొత్త రికార్డు సాధించిందన్నారు. ప్రతి గిరిజన కుటుంబాన్ని గ్రామీణ పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. త్వరలోనే గిరిజనులకు ఆన్‌లైన్‌ వైద్యం అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు.

- కూటమి ప్రభుత్వం గిరిజనులకు కలలకు రెక్కలనిచ్చే బాధ్యతను తీసుకుందని పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. ప్రతీ గిరిజన బిడ్డ డాక్టర్‌, ఇంజనీరింగ్‌, న్యాయవాది, జడ్జి వంటి ఉన్నత పదవులను అధిరోహించాలని, కూటమి ప్రభుత్వం తన వంతుగా సహయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వం సంకల్ప మన్నారు. సాంకేతికత పెరిగినా సంప్రదాయాలు, మూలాలు, భాషను కాపాడుకోవాలన్నారు. మూఢ నమ్మకాలు, నాటు వైద్యాలను పక్కనపెట్టి ఆధునిక వైద్యాన్ని ఆశ్రయించాలని సూచించారు. పీఎంఈజీపీ పథకం ద్వారా రాయితీలతో రుణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాల ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.200 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిఽధులతో రహదారులు, ఇతర అభివృద్ధి పనులు వేగవంతం చేశామన్నారు.

- గిరిజనులకు సమానమైన హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించేలా కొత్త ఉత్తర్వులు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు తెలిపారు. గిరిజన ప్రాంత బాల, బాలికల్లో శారీరక ధారుడ్యంతో పాటు అర్చరీ, షూటింగ్‌, రన్నింగ్‌ మొదలైన క్రీడల్లో సహజ సిద్ధమైన నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుచేశారు. వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే జిల్లాలో ఒక ప్రత్యేక క్రీడా అకాడమీ ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి మంత్రిని కోరారు.

- గ్లోబల్‌ డిజిటల్‌ ప్రపంచంలో గిరిజన యువత అంతర్జాతీయంగా రాణించాలని ఎస్పీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. అడవితల్లిని దేవతగా పూజించే మహోన్నతమైన జీవన విధానం, సంప్రదాయం గిరిజనుల ప్రత్యేక అని కొనియాడారు. మారుతున్న కాలానుగుణంగా గిరిజన సంస్కృతి, ఆచారాలు, భాష గుర్తింపుపై సవాళ్లు ఎదురవుతాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు.

వ్యవసాయ పరికరాల పంపిణీ

ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు లబ్ధిదారులకు రూ.8.56 కోట్ల విలువైన ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, మత్స్యకార , జీవనోపాధి సామగ్రిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడుతో పాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి జి.సంధ్యారాణి పంపిణీ చేశారు. మరికొందరికి నమూనా చెక్కులను అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. గిరిజన ఆచార వ్యవహారాలు, ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఛాయాచిత్ర ప్రదర్శన , సెల్ఫీ పాయింట్‌, వీబీ జీ రామ్‌ జీ, వాటర్‌ షెడ్‌ 2.0, వైద్య ఆరోగ్య, మత్స్య, పశు సంవర్థక, ఉద్యాన, వ్యవసాయ, సూక్ష్మ నీటిపారుదల, డీఆర్డీఏ, జీసీసీశాఖల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. న్యాయశాఖ స్టాల్‌ను సందర్శించిన మంత్రులు, మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందుతున్న ఉచిత న్యాయ సేవల వివరాలను అడిగితెలుసుకున్నారు.

‘ఆరోగ్య విప్లవం’ ప్రారంభం

గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కేంద్రంలో ‘ఆరోగ్య విప్లవం’ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. దీనిలో భాగంగా మన్యం వీడియో డాక్టర్‌ పేరిట చేపట్టే ఆన్‌లైన్‌ కార్యక్రమం ద్వారా వైద్య నిపుణుల సేవలు గిరిజనులందరికీ చేరువవుతాయని వారు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం మన్యం వీడియో డాక్టర్‌, సేవల పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు.

Updated Date - Aug 09 , 2026 | 12:14 AM