Share News

Tribal University Convocation: A Grand function ఘనం.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:23 AM

Tribal University Convocation: A Grand Affair కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌ దీనికి వేదికగా నిలిచింది.

 Tribal University Convocation: A Grand function ఘనం.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం
విద్యార్థికి పట్టా అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఘనం.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి

కాలానికి అనుగుణంగా కొత్త అంశాలపై నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు పిలుపు

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌ దీనికి వేదికగా నిలిచింది. భారతదేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా రాగా, విద్యార్థులు గిరిజన సంప్రదాయ శైలిలో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అంశాలపై నైపుణ్యం సాధించాలని సూచించారు. అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ గిరిజనుల అక్షరాస్యత శాతం పెరగాల్సి ఉందన్నారు. కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ మాట్లాడుతూ, ఈ ప్రాంత యువత బ్రిటీష్‌ వారితో పోరాడిన అల్లూరి సీతారామరాజు వారసులుగా అభివర్ణించారు. కుటుంబంపైనే కాకుండా సమాజం, దేశం పట్ల కూడా బాధ్యతతో వ్యవహరించాలని యువతకు సూచించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, డిగ్రీ పట్టాలను సాధించడమే కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారాలు కూడా కనుగొనాలని సూచించారు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే విధంగా విద్యార్థులు పరిశోధనలు చేయాలన్నారు.

గిరిజన సాధికారతే లక్ష్యం

గిరిజన సాధికారతే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లక్ష్యమని వైస్‌ చాన్సరల్‌ టి.శ్రీనివాసన్‌ వెల్లడించారు. ప్రథమ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ టి.శ్రీనివాసన్‌ కీలక ప్రసంగం చేశారు. పట్టాలు అందుకున్నవారికి అభినందనలు తెలిపారు. ఇది విద్యకు ముగింపు కాదని, సమాజం పట్ల బాధ్యతకు పునాది అని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో గిరిజనులను సమాన భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దానికి విద్యార్థులు కూడా సహకరించాలన్నారు. గత నాలుగేళ్ల నుంచి ప్రత్యేకంగా గిరిజన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధికి కొండకారకం, ఎస్‌.బూర్జవలస గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నామని, కీలక రంగాల్లో రూ.65 కోట్ల విలువైన పరిశోధన పత్రాలు సమర్పించామన్నారు. సెమీ కండక్టర్లకు ఉపయోగించే పదార్థాలు, సెన్సార్లపై పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. ఐసీఎంఆర్‌ సహకారంతో సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి నివారణకు కృషి చేస్తున్నామన్నారు. పతంజలి రీసెర్చి ఫౌండేషన్‌తో కలిసి దేశీయ వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మరో ప్రముఖ సంస్థతో కలిసి చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. గిరిజన జ్ఞానం, ఆధునిక విజ్ఞానం మేళవించి సుస్థిర పరిష్కారాలు చూపడం ద్వారా వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను సాధించడంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రముఖ కేంద్రంగా నిలపాలని కృషిచేస్తున్నామన్నారు. పట్టాలు పుచ్చుకున్నవారంతా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ విశ్వవిద్యాలయం రాయాబారులేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం నేర్చుకుంటూనే ఉండాలని ఉద్బోధించారు. యువత జ్ఞానం మానవాళి సేవకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, నారా లోకేశ్‌, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:23 AM