Tribal Student Dies అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:03 AM
Tribal Student Dies Due to Illness రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రూపవతి (13) అనే విద్యార్థిని అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రూపవతి (13) అనే విద్యార్థిని అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో రజని రేగిడి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం గద్దరజోల గ్రామానికి చెందిన అప్పలస్వామి, మాలియా పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె రూపవతి కొన్నేళ్లుగా గుండె నొప్పితో బాధపడుతుండడంతో ఒడిశా రాష్ట్రం రాయగడలో మందులు వాడుతున్నారు. మూడేళ్ల కిందట రేగిడి ఆశ్రమ పాఠశాలలలో ఆ బాలికను చేర్పించారు. కాగా పండుగ సెలవుల అనంతరం జనవరి 30న విద్యార్థిని తిరిగి ఆశ్రమ పాఠశాలకు వచ్చింది. ఆ సమయంలో రేగిడి పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయగా.. బాలిక ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈనెల 3న బ్రీతింగ్ సమస్యతో ఇబ్బందిపడిన రూపవతిని ఉపాధ్యాయులు వెంటనే రేగిడి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఆరో తేదీన బాలికను కురుపాం ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం బాలిక మృతి చెందినట్లు ఏటీడబ్ల్యూవో రజని తెలిపారు.