త్వరలో గిరిజనులకు కార్పొరేట్ వైద్యం
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:47 PM
గిరిజనులకు త్వరలో కార్పొరేట్ వైద్యసేవలు అందనున్నాయి.
పార్వతీపురం/సాలూరు, జనవరి1 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు త్వరలో కార్పొరేట్ వైద్యసేవలు అందనున్నాయి. అత్యాధునిక వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాలో నాలుగు నూతన ఆసుపత్రి భవనాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కొద్దిరోజుల్లో ప్రారంభించనున్నారు. దీంతో భద్రగిరి, సీతంపేట, కురుపాం, సాలూరు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందనున్నాయి. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ.49 కోట్ల వ్యయం వెచ్చింది. సీతంపేట ఏరియా ఆసుపత్రిని 30 పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రూ. 3 కోట్లతో 30 నుంచి 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి అవసరమైన సదుపాయాలను సమకూర్చారు. రూ.8.95 కోట్లతో భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 30 నుంచి 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు.