క్షణికావేశంతో గిరిజనుడి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:14 AM
క్షణికావేశంలో గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సీతంపేట మన్యంలో చోటుచేసుకుంది.
సీతంపేట రూరల్,ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సీతంపేట మన్యంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వై.అమ్మన్నరావు వివరాల మేరకు.. సీతంపేట మండలం హడ్డుబంగి పంచాయతీ అయ్యప్పగూడ గ్రామానికి చెందిన సవర మహేంద్ర(23)అనే గిరిజనుడు శ్రీకాకుళంలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పని చేస్తున్నాడు. మహేంద్ర భార్య సవర దీవెన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వీరిద్దరూ శ్రీకాకుళం నగరంలో ఒకే రూంలో ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం భార్యభర్తల మద్య చిన్నపాటి గొడవ తలెత్తింది. దీంతో మహేంద్ర శ్రీకాకుళం నుంచి తన స్వగ్రామం అయ్యప్పగూడకు చేరుకున్నాడు. శనివారం క్షణికావేశంలో గ్రామ సమీపంలోని తోటలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి తండ్రి సవర కడాయి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అమ్మన్నరావు తెలిపారు.
చంపావతి నదిలో పడి ఒకరి మృతి
గజపతినగరం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): స్థానికంగా ఉన్న చంపావతి నదిలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గజపతినగరం పట్టణానికి చెందిన ఎం.రమణ(45) కొంతకాలంగా స్థానిక జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న టిఫిన్ షాపులో పని చేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం అతనికి పెళ్లయింది. భార్యను విడిచిపెట్టి..మద్యానికి బానిసె ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం చంపావతి నదికి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెంది ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. దీనిపై ఎస్‌ఐ కిరణ్‌కుమార్ నాయుడును వివరణ కోరగా... ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..
రేగిడి, ఏప్రిల్ 18,(ఆంధ్రజ్యోతి): కొర్లవలస గ్రామనికి చెందిన అనపర్తి సన్యాసి(55) రోడ్డు ప్రమాదంలో గాయపడి శ్రీకాకుళంలో రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొర్లవలసకు చెందిన అనపర్తి సన్యాసి లచ్చన్నవలస సెంటర్ దరిలో ఉన్న సామిల్లులో పని చేస్తున్నాడు. ఈనెల 14న విధులు ముగించుకొని తన సైకిల్‌పై పాలకొండ- రాజాం మెయిన్‌రోడ్డుకు వస్తుండగా... వెనక నుంచి వస్తున్న మోటార్ బైక్ సన్యాసిని బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయనను శ్రీకాకుళం రిమ్స్‌కు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయనకు భార్య చిన్నమ్మడు, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కుటుంబానికి ఆధారమైన సన్యాసి మరణించడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.
ఆటో ఢీకొని వ్యక్తి ...
బాడంగి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఆటో ఢీకొనడంతో గజరాయనివలసకు చెందిన కందుల సత్యనారాయణ(58) అనే వ్యక్తి మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్ వివరాల మేరకు.. సత్యనారాయణ శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా రామభద్రపురం నుంచి బాడంగి వైపు వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో అతనికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాడంగి సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సత్యనారాయణ బంధువులు శనివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు.