ధర లేక.. గిరిజన రైతులు దిగాలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:02 AM
అష్టకష్టాలు పడి పండించిన పైనాపిల్ పంటకు మద్దతు ధర లేక గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు.
సీతంపేట రూరల్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): అష్టకష్టాలు పడి పండించిన పైనాపిల్ పంటకు మద్దతు ధర లేక గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు. గత వారం మాదిరిగానే ఈవారం కూడ పైనాపిల్ పండుకు ధర పెరగలేదని వాపో యారు. సీతంపేట వారపుసంతలో ఆదివారం పెద్దసైజు అనాస పండు రూ.తొమ్మిది పలుకుతుంటే చిన్నసైజు పైనాపిల్ పండు ధర రూ.ఆరుకు మాత్రమే అమ్ముడు పోతోందని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారడంతో పైనాపిల్‌కు గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటను మైదాన ప్రాంత వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోందని గిరి జన రైతులు చెబుతున్నారు. అయితే వారపుసంతకు పెద్దమొత్తంలో పైనాపిల్ పంట రావడంతో వ్యాపారులు కారుచౌకగా అనాస పంటను కొనుగోలు చేశారు. పైనాపిల్ పండు పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో రూ.30 వరకు అమ్ముడుపోతోందని వ్యాపారులు చెబుతున్నారు.