Tribal గిరిజనోత్సాహం
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:45 PM
Tribal Enthusiasm ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా వేషధారణలు, థింసా నృత్యాలతో సందడి చేశారు.
థింసా నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గిరిజనుల సందడి
పలుచోట్ల ర్యాలీలు.. అడవితల్లికి ప్రత్యేక పూజలు
భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులు
కురుపాం రూరల్, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా వేషధారణలు, థింసా నృత్యాలతో సందడి చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కురుపాం మండలం జి.శివడ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వారు తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రుపాయలను మంజూరు చేస్తోందని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 1.95 లక్షల మందికి మలేరియా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతీ పీహెచ్‌సీలోనూ మలేరియా నివారణ మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. పిలల్ల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హాస్టల్‌ళ్లలోనూ ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచామన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర నాయకుడు వీరేష్ చంద్రదేవ్, ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు, టీఆర్‌ఎఫ్ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురంలో ..
గుమ్మలక్ష్మీపురం: ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని గుమ్మలక్ష్మీపురం హెడ్ గ్రౌండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాలతో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నిమ్మక జయరాజు, కోలక లక్ష్మణమూర్తి, ఎంపీపీ దీనమయ్య, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గౌరీశంకరరావు, గిరిజన యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
అడవితల్లికి పాలభిషేకం
సీతంపేట: ఏజేఏసీ ఆధ్వర్యంలో సీంపేట ప్రధాన రహదారి నుంచి ఐటీడీఏ వరకు గిరిజనులు ర్యాలీ చేపట్టారు. కార్యాలయానికి సమీపంలో ఉన్న సందెమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అడవితల్లి విగ్రహాలకు పూలమాలలను వేసి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజేఏసీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావు, ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు తేజేశ్వరరావు, జేఏసీ నాయకులు కాంతారావు, రాంమోహన్‌రావు, ఉమా, వినోద్, గోపి, రామస్వామి, రవి, శ్యామ్ పాల్గొన్నారు.