Tribal Development కూటమితోనే గిరిజనాభివృద్థి
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:08 AM
Tribal Development Possible Only with the Coalition గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని.. డోలీ రహిత గ్రామాలుగా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం సీతంపేటలో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు.
ఇకపై గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సీతంపేట రూరల్, జనవరి6(ఆంధ్రజ్యోతి): గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని.. డోలీ రహిత గ్రామాలుగా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం సీతంపేటలో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టిన వినూత్న సేవా కార్యక్రమం ‘ హెల్పింగ్ హ్యాండ్స్’ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సీతంపేట ఏరియా ఆసుపత్రి గిరిజన ప్రాంతంలో కీలక వైద్య కేంద్రంగా మారనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశాం. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీతంపేట ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలను పూర్తిచేసి గిరిజనులకు అంకితం చేశాం. సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు సాయమందించడం అభినందనీయం. మన్యంలో అమలుచేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముస్తాబు, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే అనేక కొత్త రహదారులను మంజూరు చేశాం. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తాం. వచ్చే నెలలో సాలూరులో కూడా ఆసుపత్రి భవనాలను ప్రారంభిస్తాం.’ అని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ అడ్వంచర్‌పార్క్‌లోని చెరువులో చేపపిల్లలను విడిచిపెట్టారు. అక్కడి నుంచి పీఎంఆర్‌సీకి చేరుకుని గిరిజన మ్యూజియంను ప్రారంభించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలను అద్దంపట్టేలా ఏర్పాటుచేసిన పురాతన వస్తుసామగ్రిని పరిశీలించారు. గిరిజనులు వినియోగించే వీణ, తంబూర, కడియాలు, గాజులు, గిడుగులను మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ప్రభాకరరెడ్డి ధరించి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి జి.నాగభూషణరావు, డీఎంహెచ్‌వో భాస్కరరావు, టీడీపి అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు ఎం.తేజోవతి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూదేవి తదితరులు పాల్గొన్నారు.