Tribal Development గిరిజనాభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:57 PM
Tribal Development is the Priority గిరిజనాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో 78వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు.
ఏజెన్సీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలి
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే గిరిజనులకు రవాణా సౌకర్యం కల్పించండి
నెలాఖరులో మండలాల్లో ప్రజాగ్రీవెన్స్
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సీతంపేట, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గిరిజనాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో 78వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏజెన్సీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ ఎస్‌కు వచ్చే వారికి రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గిరిజనులు వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి పీవోను ఆదే శించారు. నెలలో చివరి సోమవారం ఎమ్మెల్యేల కోరిక మేరకు 16 మండలాల్లో ఏదో ఒక మండలంలో ఇన్‌చార్జి పీవో ఆధ్వర్యంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించాలన్నారు.
సీతంపేటలోనే ఐటీడీఏ ఉంచండి
సీతంపేటలోనే ఐటీడీఏను ఉంచి శ్రీకాకుళం జిల్లాలోని 16మండలాల్లో నివసిస్తున్న గిరిజనులకు కూడా సంక్షేమ పథకాలు అందించాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. రెగ్యులర్ ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలన్నారు. రెగ్యులర్ పీవో లేక పాలన కుంటుపడు తుందని తెలిపారు. దీనిపై మంత్రి ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. గిరిజన మండలాల్లో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ ప్రాంతంలో పండుతున్న పసుపు పంటకు అంతగా డిమాండ్ ఎందుకు లేదని హార్టికల్చర్ అధికారులను ఆయన ప్రశ్నించారు. పసుపు ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి సమాచారం సభ్యులకు అందించాలని మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. హట్‌బజార్‌లు నిర్మిస్తున్నా.. అవి ఎక్కడ వినియోగంలోకి రావడం లేదని, రద్దీగా ఉండే మార్కెట్ సమీపంలో వీటిని నిర్మిస్తే బావుంటుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులకు సూచించారు.
అర్ధాంతరంగా నిలిపేస్తున్నారెందుకు?
కొంతమంది కాంట్రాక్టర్లు జీఎస్‌బీ, వెట్‌మిక్స్ వేసి గిరిజన గ్రామాల్లో అర్ధాంతరంగా ఎందుకు రహదారి పనులను నిలిపివేస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రశ్నించారు. బీటి రహదారి వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అడిగారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు. దీనిపై మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ.. రహదారినిర్మాణాలు పూర్తిచేయలేని కాంట్రాక్టర్లను పక్కనే పెట్టేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపు ఆలస్యమైనా పనులు ఆగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
గిరిజన రైతుల కోసం ప్రత్యేక డ్రైవ్
పాలకొండ నియోజకవర్గంలో సుమారు 2158మంది గిరిజన రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా భూమి ఉన్న రైతులకు ఈ పథకం ఎందుకు వర్తించడం లేదని వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. గిరిజన రైతుల కోసం ఆధార్ సీడింగ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరారు. దీనిపై ఒకసారి పరిశీలించాలని ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్‌ను మంత్రి ఆదేశించారు. గిరిశిఖర గ్రామాల్లో రహదారులతో పాటు పాటు రక్షణ గోడలు నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. దీనివల్ల ప్రమాదాలను నివారించొచ్చని తెలిపారు. ప్రొటక్షన్ వాల్స్ లేని కారణంగా ఇటీవల సీతంపేట ఏజెన్సీలో చాలా మంది మృత్యువాతపడ్డారన్నారు. దీనిపై ప్రతిపాదనలు పెట్టాలని ఇంజనీరింగ్ ఈఈ రమాదేవిని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పార్వతీపురం, శ్రీకాకుళం కలెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇన్‌చార్జి జేసీ వైశాలి , నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఉమ్మడి జిల్లాలకు చెందిన పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సూచనలు, సలహాలతోనే..
ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశం మధ్యాహ్నం ప్రారంభం కావ డంతో అధికారులు ఇబ్బందులుపడ్డారు. మధ్యాహ్నం 12గంటలు దాటిన తరువాత మంత్రి సంధ్యారాణితో పాటు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలందరూ వచ్చారు. దీంతో సాయంత్రం వరకు సూచనలు, సలహాలతోనే సమావేశం సాగింది. కాగా గిరిజనసంక్షేమ విద్య, వైద్యం, ఐసీడీఎస్, వ్యవసాయం, వెలుగు శాఖలతో పాటు ఐటీడీఏ బడ్జెట్, ఖర్చులపై కూడా సభ్యులు ప్రశ్నించారు.