Share News

గిరిజనుల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:46 PM

గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

గిరిజనుల అభివృద్ధే ధ్యేయం
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి.

- జేజేఎం, పల్లె పండుగ 3.0 పనులను వేగవంత చేయాలి

- జీసీసీ ఉత్పత్తుల్లో నాణ్యత పాటించాలి

- ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో మంత్రి సంధ్యారాణి

- తమ శాఖల ప్రగతిని వివరించిన అధికారులు

- పర్యాటశాఖ అధికారి వ్యాఖ్యలపై ఆగ్రహం

పార్వతీపురంటౌన్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం పార్వతీపురం ఐటీడీఏ 75వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి వైద్య, విద్య, వ్యవసాయ, ఇంజనీరింగ్‌ శాఖల అధికారులతో సమీక్షించారు. ఐటీడీఏ పరిధిలోని 8 మండలాలతో పాటు జిల్లా కేంద్రాసుపత్రి, ఏరియా ఆసుపత్రి, 3 సీహెచ్‌సీలు, 20 పీహెచ్‌సీలు, 9 బర్త్‌వెయిటింగ్‌ హోమ్‌లు, 3 కంటైనర్‌ ఆసుపత్రులు, డయాలసిస్‌, ఎన్‌ఆర్‌సీ, ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌. విజయలక్ష్మి మంత్రికి వివరించారు. ఐటీడీఏ పరిధిలో 11 ప్రత్యేక అంబులెన్స్‌లు, 7 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు, 24 ఫీడర్‌ అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 28 వైద్యుల పోస్టులను సర్వీస్‌ కోటా పీజీ డాక్టర్లతో నవంబరు నాటికి భర్తీ చేస్తామని మంత్రికి వివరించారు. జిల్లాలో 307 సికిల్‌ సెల్‌ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 438 గిరిజన విద్యాసంస్థల్లో 29,553 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని, అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్ధి మిత్ర కిట్లను అందజేస్తున్నామని డీఈవో పి.బ్రహ్మజీరావు, ఏపీవో పి.మురళీధర్‌ తెలిపారు. వసతి గృహ విద్యార్థుల డెట్‌ చార్జీలను 10 శాతం పెంచినట్లు మంత్రి ప్రకటించారు. వ్యవసాయశాఖ, అనుబంధశాఖలకు సంబంధించి గిరిజన రైతులకు 75 శాతం రాయితీపై ట్రాక్టర్లు, పవర్‌ వీడర్లు, తైవాన్‌ స్ర్పేయర్లు, ఆయిల్‌ ఇంజన్‌లు, తార్పాలిన్లు అందిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మైదాన ప్రాంత గిరిజన రైతులకు కూడా ఐటీడీఏ పథకాలను వర్తింప జేయాలని మంత్రి సూచించారు. పాతజీడితోటల స్థానంలో ఆయిల్‌ పామ్‌, ఫైనాపిల్‌, పసుపు, కొబ్బరి వంటి లాభసాటి అంతర పంటలను ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని జిల్లాలో తక్షణమే ప్రారంభించాలని, మంత్రి ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా రూ.56.78 కోట్లతో 22 పనులు మంజూరయ్యాయని, అధికారులు తెలిపారు. గతంలో మంజూరై నిలిచిపోయిన పాతపనుల అంచనాలను సవరించి రూ.124 కోట్ల లభ్యత నిధులతో కొత్త ప్రాధాన్యతా పనులను చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాలో జేజేఎం పనులను పాధ్రానత్య క్రమంలో అన్నీ నియోజకవర్గాల్లో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రసాదాల తయారీ కోసం జీసీసీ ద్వారా నాణ్యమైన జీడిపప్పు, పసుపు, తేనే సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందని, నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకూడదని మంత్రి స్పష్టం చేశారు. జీసీసీ టర్నోవర్‌ రూ.97 లక్షల నుంచి రూ.19 కోట్లకు పెరగడంపై మంత్రి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,370 అంగన్వాడీ పోస్టుల భర్తీ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముందు ఇటీవల మృతి చెందిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన (అనసభధ్ర) గిరిజన విద్యార్థిని సబర ఆరతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు. అలాగే మన్యం జిల్లా పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రూపొందించిన నూతన టూరిజం వెబ్‌సెట్‌ను ఆవిష్కరించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులకు సాంకేతిక పారదర్శకతతో కూడిన పట్టాదారుపాస్‌ పుస్తకాలను అందజేశారు. ఈ సమావేశంలో జీసీసీ ఎండీ శోభిత, ఐటీడీఏ పీవో వైశాలి, సబ్‌కలెక్టర్‌ సచిన్‌ రహర్‌, తదితరులు పాల్గొన్నారు.

పుష్పా శ్రీవాణి ఇంటి కోసం

ఐటీడీఏ నిధులు ఎలా ఖర్చు చేస్తారు: ఎమ్మెల్యే జగదీశ్వరి

మాజీ డిప్యూటీ సీఎం పి.పుష్పా శ్రీవాణి ఇంటి ప్రహరీ నిర్మాణానికి ఐటీడీఏ నుంచి రూ.45 లక్షలు ఎలా ఖర్చు చేశారని, ఏ విధంగా కేటాయించారని పాలకవర్గ సమావేశంలో ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి అధికారులను నిలదీశారు. దీనిపై పూర్తి నివేదిక కావాలని ఎమ్మెల్యే కోరగా.. అందిస్తామని అధికారులు చెప్పారు.

జేజేఎం పనులు ఎందుకు ప్రారంభించలేదు: ఎమ్మెల్యే విజయచంద్ర

జలజీవన్‌ మిషన్‌ పనులను తన నియోజకవర్గంలో ఎందుకు ప్రారంభించలేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఎమ్మెల్యే విజయచంద్ర ప్రశ్నించారు. దీనిపై ఆయన చర్చకు పట్టుబట్టడంతో కాసేపు సభ వేడెక్కింది. పర్యాటశాఖకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా, తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని ఆ శాఖ అధికారి అనడంతో వెంటనే మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే విజయచంద్ర జోక్యం చేసుకుని ఆ అధికారిపై మండిపడ్డారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే మీ జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారా? అని ఆమెను ప్రశ్నించారు.

జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తాం: మంత్రి సంధ్యారాణి

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘గిరిజన ప్రాంతాల్లో 147 రహదారులకు సంబంధించి ఇప్పటికే మొదటి, రెండోవిడత లేయర్‌ పనులు పూర్తయ్యాయి. మూడో విడత పనులకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాం. పల్లెపండుగ 3.0, జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామీణ పాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు, సీసీ రహదారులు, కాలువలు ఏర్పాటు చేస్తున్నాం. జీరామ్‌జీ పథకం కింద అంగన్వాడీలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తున్నాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గిరిజనులకు త్వరలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేస్తాం. గిరిజన సహకారం సంస్థ ద్వారా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గిరిజనులు పండించే జీడీపప్పు, ఎండుమిర్చి చింతపండు, పసుపు వంటి ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానికి సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఐడీడీఏ చరిత్రలో గొప్ప అచీవ్‌మెంట్‌. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు.’అని తెలిపారు.

Updated Date - Oct 08 , 2026 | 11:46 PM