Share News

కదంతొక్కిన గిరిజనం

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:05 AM

గిరిజన యువతిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మరే ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి హత్యను ఖండిస్తూ.. సోమవారం ఏజేఏసీ ఆధ్వర్యంలో సీతంపేట వారపుసంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. గిరిజన యువతి కుటుంబానికి న్యాయంచేయాలని నినదించారు.

కదంతొక్కిన గిరిజనం
సీతంపేటలో నిరసన ర్యాలీ చేస్తున్న గిరిపుత్రులు

  • బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఏజేఏసీ డిమాండ్‌

సీతంపేట రూరల్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): గిరిజన యువతిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మరే ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి హత్యను ఖండిస్తూ.. సోమవారం ఏజేఏసీ ఆధ్వర్యంలో సీతంపేట వారపుసంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. గిరిజన యువతి కుటుంబానికి న్యాయంచేయాలని నినదించారు. హత్యకు కారకులైన వారి ఆస్తులను ప్రభుత్వం జప్తుచేసి బాధిత కుంటుబానికి స్వాధీనపరచాలని నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన యువతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హత్యకు గురైన ఉషారాణి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం, ఇతర రాయితీలు అందించాలన్నారు. కొద్దిసేపటి తర్వాత గిరిజనుల వద్దకు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ చేరుకున్నారు. మృతురాలు ఉషారాణి తల్లిదండ్రులు చిన్నారావు, కామమ్మల ఆవేదనను విన్నారు. గిరిజన యువతిని హత్యచేయడం అమానుషమని, ఇటువంటి సంఘటనలను ప్రభుత్వం ఉపేక్షించదని, నిందితులకు కఠిన శిక్ష పడుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ఉషారాణి కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఆ తర్వాత ఉషారాణి తల్లిదండ్రులు, ఏజేఏసీ నాయకులు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నిరసనలో ఏజేఏసీ నాయకులు బిడ్డిక శ్రీనివాసరావు, వాబయోగి, ధర్మారావు , ప్రజా సంఘాల నేతలు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 08:50 AM