వణికిస్తున్న జ్వరాలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:36 PM
మండలంలోని తూర్పు ఏజెన్సీని జ్వరాలు వణికిస్తున్నాయి. పదుల సంఖ్యలో గిరిజనులు మలేరియా జర్వాల బారిన పడ్డారు.
- ఏజెన్సీలో పదుల సంఖ్యలో బాధితులు
- శుక్రవారం ఒక్కరోజే ఐదుగురికి మలేరియాగా నిర్థారణ
- కిటకిటలాడుతున్న చినమేరంగి ఆస్పత్రి
జియ్యమ్మవలస, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తూర్పు ఏజెన్సీని జ్వరాలు వణికిస్తున్నాయి. పదుల సంఖ్యలో గిరిజనులు మలేరియా జర్వాల బారిన పడ్డారు. రోజురోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కష్టాన్నే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు ఉదయం ఉపాధి పనులు చేస్తూ, ఆ వెంటనే జీడి పిక్కలు ఏరివేతకు వెళ్తుంటారు. దీంతో విపరీతమైన ఎండ వేడిమికి వడదెబ్బకు గురవడంతో పాటు జ్వరాలబారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే అర్నాడ పంచాయతీ కొత్తవలస గ్రామం నుంచి మూడేళ్ల బాలుడు కె.నితిన్‌తో పాటు ఎ.రామారావు, వి.శారద, బి.పార్వతి, అదే పంచాయతీ కొత్తగూడ నుంచి కె.దీక్షిత జ్వరాలతో చినమేరంగి సీహెచ్‌సీలో చేరారు. వీరికి వైద్యాధికారి రాఘవేంద్ర అన్ని పరీక్షలు చేశారు. వీరందరికీ మలేరియా పాజిటివ్ రావడంతో చికిత్స అందిస్తున్నారు. గత పది రోజులుగా తూర్పు ఏజెన్సీ పరిధిలో వివిధ గ్రామాల నుంచి పదుల సంఖ్యలో జ్వర పీడితులు వచ్చి ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరందరికీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాసుదేవరావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఖచ్చితమైన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్య నియమాలను వివరిస్తున్నారు. తూర్పు ఏజెన్సీకి దగ్గరలో జియ్యమ్మవలస, ఆర్‌ఆర్‌బీ పురం పీహెచ్‌సీలు ఉన్నాయి. అయితే, అక్కడ సరైన వైద్య సేవలు, సౌకర్యాలు లేవని చెప్పి గిరిజనులు నేరుగా చినమేరంగి సీహెచ్‌సీకి వచ్చి వైద్యం పొందుతున్నారు.