Share News

‘రైతు ప్రయోజనాల కోసమే ‘గట్టుమీద చెట్టు’

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:10 AM

రైతు ప్రయోజనాల కోసమే గట్టు మీద చెట్టు కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అన్నారు.

‘రైతు ప్రయోజనాల కోసమే ‘గట్టుమీద చెట్టు’
మొక్క నాటుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

జియ్యమ్మవలస, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రయోజనాల కోసమే గట్టు మీద చెట్టు కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అన్నారు. బుధవారం సుభద్రమ్మవలస సమీపంలో నిర్వహించిన గట్టు మీద చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి.. పాలకొండ డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌తో కలిసి సుభద్రమ్మవలస సమీపంలో మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గట్టు మీద చెట్టు వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుం దన్నారు. ప్రతీ రైతు తమ పొలం గట్లుపై ఉసిరి, నిమ్మ, కొబ్బరి, టేకు, మునగ, మామిడి వంటి మొక్కలు నాటి వాటిని సంరక్షించా లన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ సీహెచ్‌. దీనకుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్‌, కురుపాం ఏడీఏ అన్నపూర్ణమ్మ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల వ్యవసాయాధికారులు, ఉద్యానవనశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:10 AM