Travels Danda ట్రావెల్స్ దందా
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:53 PM
Travels Danda ఎక్కడెక్కడికో ఉపాధి కోసం వెళ్లిన శ్రమ జీవులు సంక్రాంతికి స్వగ్రామాలకు తిరిగి చేరుతున్నారు. బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ పరిస్థితిని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. చార్జీల దందాకు దిగుతున్నాయి. మూడు, నాలుగింతలు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. అడ్డగోలు దోపిడీకి సామాన్యుడు బలవుతున్నాడు. కుటుంబంతో స్వగ్రామాలకు వచ్చేందుకు రెండు, మూడు నెలల జీతాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది.
ట్రావెల్స్ దందా
మూడు, నాలుగింతలు అదనంగా చార్జీల వసూలు
కుటుంబ ప్రయాణ ఖర్చు రూ.వేలల్లోనే..
పట్టించుకోని రవాణా శాఖ అధికారులు
ఎక్కడెక్కడికో ఉపాధి కోసం వెళ్లిన శ్రమ జీవులు సంక్రాంతికి స్వగ్రామాలకు తిరిగి చేరుతున్నారు. బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ పరిస్థితిని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. చార్జీల దందాకు దిగుతున్నాయి. మూడు, నాలుగింతలు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. అడ్డగోలు దోపిడీకి సామాన్యుడు బలవుతున్నాడు. కుటుంబంతో స్వగ్రామాలకు వచ్చేందుకు రెండు, మూడు నెలల జీతాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది.
విజయనగరం, జనవరి 10(ఆంధ్రజ్యోతి):
జిల్లా ప్రజలు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. చెన్నైలో భవన నిర్మాణ కార్మికులుగా చాలా మంది పనిచేస్తున్నారు. మత్స్యకారులు గుజరాత్‌కు ఉపాధి కోసం వెళ్లి ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా బెంగళూరు, ముంబయిలో చాలా మంది స్థిరపడ్డారు. ఇతర దేశాల్లో కూడా వందలాదిగా ఉంటున్నారు. రాజమండ్రి, కడియం తదితర ప్రాంతాల్లో నర్సరీల్లో పనిచేసేవారు కూడా అధికమే. ఇప్పుడు వారంతా స్వగ్రామాలకు వస్తున్నారు. అయితే రైల్వేశాఖ ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆర్టీసీ సర్వీసులను పెంచలేదు. దీంతో ముందస్తు బుకింగ్‌లు గంటల వ్యవధిలో ముగుస్తున్నాయి. ప్రధానంగా 10,11,12,13 తేదీల్లో రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సుల్లో బుకింగ్‌లు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో సైతం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తాకిడి అధికంగా ఉంటోంది. ప్రధాన నగరాలను కలుపుతూ ఈ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. మన జిల్లాకు సంబంధించి ట్రావెల్ బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ వంటి నగరాలకు వెళుతుంటాయి. అయితే గత నెల రోజులుగా టిక్కెట్ ధరలు పెంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పండుగ సమీపిస్తుండడంతో కృత్రిమకొరత సృష్టిస్తున్నారు. టిక్కెట్లు అమ్ముడైపోయాయని నమ్మబలుకుతున్నారు. రూ.1800 ఉండాల్సిన టిక్కెట్ ధరను రూ.5000 వరకూ వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో ట్రావెల్స్ యజమానులు సిండికేట్ అయినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
మణికుమార్, రవాణాశాఖ ఉపకమిషనర్
జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ప్రైవేటు బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎవరైనా ప్రభుత్వ అనుమతులకు మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా చర్యలు తప్పవు.
-----------