Share News

Traveling... Connecting... తిరుగుతూ.. కనెక్ట్‌ అవుతూ

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:45 PM

Traveling... Connecting... జిల్లాలో ఫైబర్‌ నెట్‌ సేవలకు తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నెలలో సగానికిపైగా రోజులు సేవలు నిలిచిపోతుండడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యంగా ఉంటుందని కనెక్షన్‌ తీసుకుంటే ఇదేంటిలా అని ప్రశ్నిస్తున్నారు.

Traveling... Connecting... తిరుగుతూ.. కనెక్ట్‌ అవుతూ

- విజయనగరానికి చెందిన రామరాజు చిరుద్యోగి. ఫైబర్‌ నెట్‌తో ఇంట్లో టీవీతో పాటు పిల్లలకు అవసరమైన ఇంటర్‌ నెట్‌ సేవలు వినియోగించుకోవచ్చని భావించాడు. కానీ ఎప్పుడు నెట్‌ ఉంటుందో.? ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. అవసరమైనప్పుడు కనెక్ట్‌ కావడం లేదు. దీంతో విసిగి వేసారిపోయిన రామరాజు ప్రైవేటు నెట్‌కు మారిపోయాడు.

- చీపురుపల్లికి చెందిన చిరు వ్యాపారి విజయరామారావు ఇంటి అవసరాలతో పాటు టీవీ ప్రసారాలకుగాను ఏపీ ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు. ఒక నెల రూ.500తో రీచార్జ్‌ చేసుకుని అన్నిరకాల సేవలు పొందారు. తరువాత నెలలో 20 రోజులకుపైగా సాంకేతిక సమస్యలతో సేవలకు అంతరాయం కలగడంతో విసిగిపోయి ఫైబర్‌ నెట్‌ నుంచి వైదొలిగాడు.

తిరుగుతూ.. కనెక్ట్‌ అవుతూ

ఫైబర్‌ నెట్‌ సేవలకు తరచూ అంతరాయం

కనెక్షన్‌ తొలగించుకుంటున్న పలువురు

నెలలో సగానికిపైగా ఇబ్బందులు

ప్రైవేటు నెట్‌ సర్వీసుల వైపు చాలా మంది మొగ్గు

విజయనగరం, అగస్టు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫైబర్‌ నెట్‌ సేవలకు తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నెలలో సగానికిపైగా రోజులు సేవలు నిలిచిపోతుండడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యంగా ఉంటుందని కనెక్షన్‌ తీసుకుంటే ఇదేంటిలా అని ప్రశ్నిస్తున్నారు. చివరకు ప్రైవేటు నెట్‌ సేవలవైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో గృహాలకు సంబంధించి 18 వేల నుంచి 20 వేల ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలోనే అధిక కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు ప్రభుత్వపరంగా సచివాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మరో 2 వేల వరకూ సర్వీసులు ఉన్నాయి. అయితే వాటికి కూడా నిరంతరాయంగా సేవలు అందించడంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ విఫలమవుతోంది. దీంతో వినియోగదారులు విసిగిపోయి ప్రైవేటు నెట్‌వర్కులను ఆశ్రయించాల్సి వస్తోంది. దాదాపు అన్ని పట్టణాలు, మునిసిపాల్టీల్లో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు తగ్గుముఖం పట్టాయి. జియో, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థల కనెక్షన్లు పెరుగుతున్నాయి.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ఏర్పాటైంది. 2017లో ఇంటర్నెట్‌, కేబుల్‌, ల్యాండ్‌ ఫోన్‌.. ఇలా మూడు రకాల సేవలను అతి తక్కువ ధరకు ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు ప్రారంభించారు. వాస్తవానికి ఈ మూడు సేవలను విడివిడిగా ప్రైవేటు సర్వీస్‌ ప్రొవైడర్లు అందించేవారు. ఈ పరిస్థితిలో ఈ మూడు రకాల సేవలను ఫైబర్‌ నెట్‌ ద్వారా అందించడం ద్వారా ప్రజలకు ఆర్థిక సాంత్వన చేకూర్చవచ్చని అప్పటి ఇప్పటి సీఎం చంద్రబాబు భావించారు. విద్యుత్‌ శాఖతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటుచేశారు. రూ.149కే బేసిక్‌ ప్లాన్‌ అందుబాటులోకి తేవడంతో అనతికాలంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. సామాన్య ప్రజలు, విద్యార్థులు ఫైబర్‌ సేవలు చౌకగా లభిస్తున్నాయని ఆసక్తి చూపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ బేసిక్‌ ప్లాన్‌ను రూ.149ను ఏకంగా రూ.350కు పెంచింది. పైగా ఫైబర్‌ నెట్‌ నిర్వహణను గాలికి వదిలేయడంతో సేవలకు అంతరాయం కలిగింది. ఆపై వినియోగదారుల సంఖ్య తగ్గింది. జిల్లాలో 2020 నాటికి 40 వేల వరకూ కనెక్షన్లు ఉండగా.. 2024 వచ్చేసరికి 18 వేలకు పడిపోయింది. ఆ తర్వాత కూడా సేవలు నిరాశాజనకంగానే సాగుతున్నాయి. పైబర్‌ నెట్‌ తీగలు తెగిపోతే పట్టించుకోవడం మానేశారు. నెలల కొద్దీ వదిలేస్తున్నారు. రోడ్డుపై పడే వైరు వాహనాల రాకపోకలతో నలిగిపోతున్నా పట్టించుకునే నాథుడు కరువు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెట్‌ వినియోగదారులు ఇతర ప్రైవేట్‌ ఇంటర్‌ సర్వీసులవైపు మొగ్గుచూపుతున్నారు.

టారిఫ్‌లు అందుబాటులో ఉన్నా..

వాస్తవానికి ఏపీ ఫైబర్‌ నెట్‌ టారిఫ్‌ ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. రూ.349తో ప్రైవేటు సంస్థలకు దీటుగా సేవలు అందుతున్నాయి కానీ 100 ఎంబీబీఎస్‌ నెట్‌ స్పీడు ఉంటేనే సేవలు సాధ్యమయ్యేది. తరచూ అంతరాయం ఏర్పడుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నెట్‌వర్క్‌ సక్రమంగా ఉండడం లేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విస్తరించే పనులేవీ చేయలేదు. కేవలం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రవేశపెట్టారన్న ఒకే ఒక కోపంతోనే నిర్లక్ష్యంగా విడిచిపెట్టారు. గాడిన పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆలస్యం జరుగుతోంది. జిల్లాలో వీలైనంత త్వరగా ఫైబర్‌ నెట్‌ సమస్యలను పరిష్కరించి నెట్‌వర్క్‌ను గాడిన పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

సిగ్నల్స్‌ అందడం లేదు

సిగ్నల్‌ సమస్య వెంటాడుతోంది. జిల్లాలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవల్లో ఎటువంటి పురోగతి లేదు. ముఖ్యంగా సిగ్నల్‌ సమస్యలు వేధిస్తున్నాయి. ఇతర ప్రైవేటు సంస్థల కంటే బేసిక్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది కానీ ప్రైవేటు సంస్థలు ఇస్తున్న నాణ్యత ఇవ్వడం లేదు. నిర్వహణ సైతం బాగుండడం లేదు. ఇప్పటికైనా ఫైబర్‌ నెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి.

- రాజారావు, ప్రైవేటు ఉద్యోగి, విజయనగరం

పరిష్కరిస్తున్నాం

ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తృతం చేశాం. జిల్లాలో గతంలో కంటే కనెక్షన్లు పెరిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఉంది. సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు తక్కువ ధరకు బేసిక్‌ ప్లాన్‌ అందుబాటులోకి తేనుంది. ప్రతి గ్రామానికీ ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- రవి, ఇంజనీర్‌, ఏపీ ఫైబర్‌ నెట్‌, విజయనగరం

Updated Date - Aug 12 , 2026 | 11:45 PM